Begin typing your search above and press return to search.

బాబు ఆక‌ర్ష‌ణ మంత్రం అప్పుడే విక‌టిస్తోందా

By:  Tupaki Desk   |   6 May 2016 7:12 AM GMT
బాబు ఆక‌ర్ష‌ణ మంత్రం అప్పుడే విక‌టిస్తోందా
X
ఏపీలో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయింపులు ఎంత స్పీడుగా ఉన్నాయో తెలిసిందే.. అయితే, రాజ‌కీయ విశ్లేష‌కులు - అనుభ‌వశీలురు ఆది నుంచి చెబుతున్న‌ట్లే ఫిరాయింపులు బెడిసికొట్ట‌డం అప్పుడే మొద‌లైనట్లుగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మొద‌ల‌వుతుందని అనుకుంటున్న రివ‌ర్స్ ఇంపాక్ట్ చాలా ముందుగానే మొద‌లైన సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిపక్షం నుంచి, జాతీయ పార్టీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున సాగుతున్న చేరిక‌ల వ‌ల్ల టీడీపీ చెరువులో చేప‌లు ఎక్కువై ఒక‌దాన్నొక‌టి పొడుచుకుంటాయ‌ని.. ఆ చెరువులో ఇమ‌డ‌లేక గ‌ట్టుదాటే ప్ర‌య‌త్నం చేస్తాయ‌ని అంతా ఊహిస్తున్నారు.

ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ జిల్లాల్లో పాత‌ - కొత్త నేత‌ల మ‌ధ్య కొట్లాట‌లు తీవ్రం కాగా తాజాగా మ‌ళ్లీ వైసీపీలోకి వెళ్తామంటున్న నేత‌ల మాట‌లూ వినిపిస్తున్నాయి. ఇది చంద్ర‌బాబుకు ఇబ్బందిక‌ర‌మైన ప‌రిణామ‌మే. తాజాగా క‌ర్నూలు టీడీపీలో ఉన్న రాయ‌లసీమ బ్రాండ్ నేత టీజీ వెంక‌టేశ్ - మాజీ మంత్రి ఏరాసు ప్ర‌తాప రెడ్డిల వ్య‌వ‌హారం చూస్తుంటే వారు వైసీపీ వైపు చూస్తున్నట్లుగా క‌నిపిస్తోంది. త‌మ‌ను పార్టీలో చేర్చుకున్న‌ప్పుడు చెప్పిన మాట‌ల‌కు ఇప్పుడు చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకు పూర్తి భిన్నంగా ఉంద‌ని, త‌మ దారి తాము చూసుకుంటే మంచిద‌ని, క‌ర్నూలు బ్ర‌ద‌ర్స్‌ గా పిలిచే ఏరాసు ప్ర‌తాప్ రెడ్డి - టీజీ వెంక‌టేష్ లు అభిప్రాయ‌ప‌డుతున్నట్లుగా తెలుస్తోంది.

శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గంలోకి ఏరాసు జోక్యాన్ని త‌గ్గించేందుకు వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖ‌ర్ రెడ్డి ని బాబు పార్టీలోకి ఆహ్వానించిన‌ట్లు ఆయ‌న ఫీల‌వుతున్నార‌ట‌. దీంతో క‌ర్నూలు రాజ‌కీయాల్లో కొత్త వేడి మొద‌లైంది. త్వ‌ర‌లో క‌ర్నూలులోనూ టీజీకి చెక్ పెట్టేలా రాజ‌కీయ ప‌రిణామాలు మార‌నున్న‌ట్లు సూచ‌న‌లున్నాయి. అదే జ‌రిగితే టీజీకి ఇబ్బందే. కిర‌ణ్ కుమార్ రెడ్డి స‌ర్కార్ లో హ‌డావుడి చేసిన ఈ నేత‌లిద్ద‌రికీ ఇలాంటి ప‌రిణామాలు మింగుడు ప‌డ‌డం లేదు. త‌మ సీట్ల‌కే ఎర్త్ పెట్టేస్తున్న ప‌రిస్థితుల్లో వారు టీడీపీలో ఇక ఉండ‌నవ‌స‌రం లేద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. త‌మకు సుర‌క్షిత స్థానాలు ఎంచుకోవ‌డం శ్రేయ‌స్క‌ర‌మ‌న్న భావ‌న‌లో వారు స్థాన మార్పిడి కంటే పార్టీ మార్పిడివైపు దృష్టి పెట్టిన‌ట్లు చెబుతున్నారు. పార్టీ మార్పిడి అంటే ఎంత కాద‌నుకున్నా వైసీపీని మించిన ప్ర‌త్యామ్నాయం లేద‌ని భావిస్తూ అటువైపు అడుగులు వేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఏరాసు ప్ర‌తాప్ రెడ్డి - టీజీ వెంక‌టేష్ లు ఇప్ప‌టికే వైఎస్ ఆర్‌ సీపీతో ట‌చ్ లోకి వెళ్లార‌ని క‌ర్నూలులో గుప్పుమంటోంది. టీడీపీని వీడ‌డానికి గ్రౌండు ప్రిపేర్ చేయ‌డంలో భాగంగానే టీజీ వెంక‌టేష్ తాజాగా చంద్ర‌బాబు విధానాల‌ను ప్ర‌శ్నించార‌ని చెబుతున్నారు. అభివృద్ది మొత్తం అమ‌రావ‌తిలో కేంద్రీక‌రిస్తూ క‌ర్నూలు - సీమ ప్రాంతాల‌కు అన్యాయం చేస్తున్నార‌ని టీజీ ఓపెన్ కామెంట్లు చేయ‌డం తెలిసిందే. ఇదిప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏరాసు, టీజీల‌కు వైసీపీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఒక‌సారి ఇది మొద‌లైందంటే మిగ‌తా జిల్లాల్లోనూ ఇలా ఇబ్బంది ప‌డుతున్న నేత‌లు మ‌రింత మంది వైసీపీ వైపు చూసే ప్ర‌మాద‌ముంది. అదే జ‌రిగితే చంద్ర‌బాబు అయ‌స్కాంతం వికర్ష‌ణ మొద‌లుపెట్టిన‌ట్లే భావించాలి.