Begin typing your search above and press return to search.

గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో మంత్రి ఎర్ర‌బెల్లి హ‌వా.. ఫ‌లించేనా?

By:  Tupaki Desk   |   25 Nov 2020 1:30 AM GMT
గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో మంత్రి ఎర్ర‌బెల్లి హ‌వా.. ఫ‌లించేనా?
X
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ దూకుడు మామూలుగా లేదు. ఎక్క‌డిక‌క్క‌డ మంత్రులే ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే మంత్రుల‌కు ప్రాధాన్యాలు అప్ప‌గిస్తూ.. దిశానిర్దేశం చేశారు. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉండ‌డం.. అదేస‌మ‌యంలో ప్ర‌క్షాళ‌న కూడా ఉండ‌డం.. ఇప్పుడు గ్రేట‌ర్ ఫైట్ వ‌చ్చి ప‌డ‌డంతో మంత్రులు ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌చారానికి దిగారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. టీఆర్ ఎస్ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థుల క‌న్నా కూడా మంత్రుల‌కే ఎక్కువ‌గా టెన్ష‌న్‌గా ఉంద‌ని.. చెమ‌ట‌లు కక్కుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప‌లు వార్డుల‌ను ద‌త్త‌త తీసుకుని మ‌రీ మంత్రులు సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ కూడా త‌న ప‌రిధిలో తెలతెల వారుతూనే ప్ర‌చారానికి దిగిపోతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు అనేక ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు నాయ‌కులు ఎక్క‌డిక‌క్క‌డ త‌మ రూపాల‌ను మారుస్తూ ఉంటారు. ఏ రోటికాడ ఆపాట‌! అన్న‌ట్టుగా ఏ వృత్తులు చేసుకునే వారి వ‌ద్ద‌కు వెళ్తే.. వారితో అదేవిధంగా లీన‌మై మాట్లాడుతూ ఉంటారు. అయితే.. ఇప్పుడు గ్రేట‌ర్ కూడా సార్వ‌త్రిక స‌మరాన్ని మించిపోయింది. దీంతో నాయ‌కులు అదే త‌ర‌హా ప్రచారాన్ని ముమ్మ‌రం చేస్తున్నారు.

ప్రచారంలో భాగంగా మంగాపురం కాలనీలో మంత్రి ఎర్రబెల్లి పూలమ్మారు. పూలను అమ్ముతూనే ప్రజలను ఓట్లు అడిగారు. మీర్‌పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ టీఆర్ఎస్ అభ్యర్థి జెర్రి పోతుల ప్రభుదాస్‌తో కలిసి, ఇంటింటికీ తిరుగుతూ, ప్రతి ఓటరును కలుస్తున్నారు. ఓటర్లతో ప్రత్యేకంగా ఫొటోలు దిగుతూ.. యువతను ఉత్సాహపరుస్తూ, కాలనీల్లో కలియతిరుగుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు హామీలు కూడా గుప్పిస్తున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ల‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. వారితోనే హైద‌రాబాద్ పుంజుకుంటుంద‌ని, విశ్వ‌న‌గ‌రంగా మారుతుంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి హామీలు ఇస్తున్నారు. కేసీఆర్ ప్రకటించిన కొత్త పథకాలు ప్రజలకు మేలు చేస్తాయన్నారు. మొత్తంగా ఒక్క ఎర్ర‌బెల్లి మాత్ర‌మే కాదు.. దాదాపు మంత్రులు అంద‌రూ కూడా గ్రేట‌ర్ ఫైట్‌తో త‌మ రాజ‌కీయ భ‌విత‌వ్యాన్నే ప‌రీక్షించుకుంటున్నార‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.