Begin typing your search above and press return to search.

క్లారిటీ ఇచ్చాక కూడా ఈ పిసుకుడేంది ఎర్రబెల్లి

By:  Tupaki Desk   |   2 Jan 2020 12:12 PM GMT
క్లారిటీ ఇచ్చాక కూడా ఈ పిసుకుడేంది ఎర్రబెల్లి
X
మనసు దోచుకోవటానికి పొగడ్తకు మించింది మరొకటి ఉండదు. అందుకే.. అధికారంలో ఉన్న వారిని పొగడ్తలతో పడేసేందుకు చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అయితే.. ఇలాంటి వాటికి పడిపోవటానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆయన కుమారుడు కేటీఆర్ కానీ అంత అమాయకులేం కాదు. ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించే వారు.. తమకు బిస్కెట్లను వేసే వారిని ఇట్టే గుర్తిస్తారు.

అయినప్పటికీ కేటీఆర్ మనసు దోచుకోవటానికి ఆయన గురించి కొందరు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరేనని వ్యాఖ్యానించిన మంత్రి మాటలపై కొత్త సంవత్సరం వేళ విలేకరులతో సమావేశమైన కేటీఆర్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

తర్వాత ముఖ్యమంత్రి కూడా తానేనని కేసీఆరే స్వయంగా స్పష్టత ఇచ్చారని.. అలాంటప్పుడు ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద చర్చే లేదని తేల్చేశారు. కేటీఆర్ నోటి నుంచి ఇంత స్పష్టంగా వ్యాఖ్యలు వచ్చి రోజు కూడా కాక ముందే మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కేటీఆర్ అన్ని విధాలుగా సమర్థమైన నాయకుడని.. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని వ్యాఖ్యానించారు.

కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత కేసీఆర్ దేనన్న ఆయన.. వచ్చే మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా ఏకపక్షమేనన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. మిగిలిన మాటలు ఎలా ఉన్నా.. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేమిటన్న ప్రస్తావన తేవాల్సిన అవసరం ఏమిటన్నది ప్రశ్న.

మరో టర్మ్ కు ముఖ్యమంత్రి పదవి మీద కేసీఆర్ కర్చిఫ్ వేసిన విషయాన్ని స్పష్టంగా చెబుతున్న వేళ.. మళ్లీ అదే విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. చూస్తుంటే.. కేటీఆర్ మీద తనకున్న స్వామి భక్తిని ప్రదర్శించుకోవటంతో పాటు.. ఎందుకైనా మంచిది కాస్త ముందుగానే సీఎం పేరుతో కేటీఆర్ ను పిసికేస్తే అలా పడి ఉంటుందని ఎర్రబెల్లి భావిస్తున్నారా? అన్నది ప్రశ్న. అయినా.. ఇలాంటి పిసుకుళ్లకు.. బిస్కెట్లకు కేటీఆర్ పడిపోయేవాడా?