Begin typing your search above and press return to search.

వైసీపీ, కాంగ్రెస్‌ కు టీడీపీని తాక‌ట్టుపెట్టిన బాబు

By:  Tupaki Desk   |   28 May 2017 4:35 AM GMT
వైసీపీ, కాంగ్రెస్‌ కు టీడీపీని తాక‌ట్టుపెట్టిన బాబు
X
తెలుగుదేశం పార్టీ పండుగ అయిన‌ మ‌హానాడు సంద‌ర్భంగా విశాఖ‌లో టీడీపీ శ్రేణులంతా జ‌మ‌కూడగా...వారందరి స‌మక్షంలో తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఉత్సాహ‌భ‌రిత వాతావ‌ర‌ణంలో ఉంటే ఆయ‌న్ను నీరుగార్చేవ్యాఖ్య‌లు చేశారు సీనియ‌ర్ ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. మ‌హానాడు సంద‌ర్భంగా తెలంగాణ స‌ర్కారుపై టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేయ‌డం, కాంగ్రెస్‌-టీడీపీలు పొత్తు పెట్టుకుంటాయ‌నే వార్త‌ల నేప‌థ్యంలో ఎర్ర‌బెల్లి మండిప‌డ్డారు. త‌న‌తో స‌హా పార్టీ పిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, సాయన్న మాగంటి గోపినాథ్, తీగల కృష్ణారెడ్డి, రాజేందర్ రెడ్డితో క‌లిసి ఎర్రబెల్లి దయాకర్ రావు విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ బాబుపై దుమ్మెత్తిపోశారు. తెలంగాణలో టీడీపీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారని మండిప‌డ్డారు. ఏపీలో వైసీపీకి తాక‌ట్టుపెట్టార‌ని ఆరోపించారు.

ఏపీలో టీడీపీ మహానాడు జ‌రుగుతున్న తీరు చూస్తే బాధ క‌లుగుతోంద‌ని ఎర్ర‌బెల్లి అన్నారు. మహానాడు వేదిక మీదున్నది అందరూ టీడీపీకి వ్యతిరేకంగా గతంలో పనిచేసిన వారేన‌ని తెలిపారు. ఇపుడు టీడీపీలో ఉన్న వాళ్లంత టీడీపీ వ్యతిరేకులేన‌ని, టీడీపీని నాశనం చేశారని మండిప‌డ్డారు. చంద్రబాబు తెలంగాణలో టీడీపీని కాంగ్రెస్ కు అమ్మేశారని ఎర్ర‌బెల్లి మండిప‌డ్డారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైపాల్ రెడ్డి టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై సంకేతాలిచ్చారని అయితే కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టిన‌ టీడీపీ ఆ పార్టీతో ఎలా జ‌ట్టుకడుతుంద‌ని ప్ర‌శ్నించారు. మామ అల్లుళ్ళయిన జైపాల్ రెడ్డి-రేవంత్ రెడ్డి టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారని తెలిపారు. అయితే మామ అల్లుళ్ళు కాదు కదా ఏ శక్తి టీఆర్ఎస్‌ను ఏమీ చేయలేదని తేల్చిచెప్పారు. తెలంగాణ లో మిగిలేది టీఆర్ఎస్‌ ఒక్కటేన‌ని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ కు తిరుగే లేదని, ఆయన అభివృద్ధి పనులతోనే తాము టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేశామ‌న్నారు. తామంతా టీడీపీ వ్యవస్థాపక సభ్యులమ‌ని పేర్కొంటూ 12 మంది ఎమ్మెల్యేలం టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేశామ‌ని పున‌రుద్ఘాటించారు. అలాంటి త‌మ‌ను త‌ప్పుప‌ట్టే హ‌క్కు బాబుకు లేద‌న్నారు. ఏపీలో టీడీపీని వైసీపీ మయం చేశారని ఎర్ర‌బెల్లి మండిప‌డ్డారు. టీడీపీ కోసం మొదట్నుంచి కష్టపడ్డ నేతలకు ఇప్పుడు అవమానాలే మిగిలాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆస్తులను తగులబెట్టిన కాంగ్రెస్ తో పొత్తు ఆలోచనే దుర్మార్గమ‌ని అన్నారు. ఆనాడు లక్ష్మీ పార్వతి నుంచి టీడీపీని కాపాడుకునేందుకే చంద్రబాబు కు మద్దతిచ్చామని తెలిపారు. టీడీపీలో మిగిలిన కార్యకర్తలు కూడా బంగారు తెలంగాణ కోసం మాతో కలిసి రావాలని కోరారు.

మిగ‌తా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ విధానాలకు పూర్తి మద్దతునిస్తున్నామ‌ని అన్నారు. ఏ ప్రభుత్వంలో ఇన్ని కార్యక్రమాలు అమలు కాలేదని, టీడీపీ హయంలో ఇన్ని పథకాలు ఎపుడు అమలు కాలేదని తెలిపారు. సిద్ధాంతాలకు టీడీపీ తిలోదకాలివ్వడం భాధగా ఉందన్నారు. ఎవరెన్నీ పొత్తులు పెట్టుకున్నా టీఆర్ఎస్‌దే అంతిమ విజయమ‌ని తెలిపారు. కాంగ్రెస్ పాదాల దగ్గర టీడీపీ ని తాకట్టు పెట్టడం దురదృష్టకరమ‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ మీద వ్యతిరేకత తో పుట్టిన పార్టీ టీడీపీ అని తెలిపారు. టీడీపీ కి తెలంగాణలో పుట్టగతులు ఉండవ‌ని తెలిపారు.ఇప్పుడు ఎగిరెగిరి ప‌డుతున్న రేవంత్ రెడ్డి టీడీపీలోకి ఎపుడొచ్చారని ప్ర‌శ్నించారు. మధ్యలో టీడీపీ లోకి వచ్చిన వాళ్ళు పార్టీ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందని అన్నారు. రేవంత్ ఓ బ్రోకర్ అని, ఆ బ్రోకర్ వల్లే టీడీపీ తెలంగాణ లో నాశనం అవుతోందని మండిప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/