Begin typing your search above and press return to search.

మొసలి కన్నీరంతా మంత్రి పదవి కోసమేనట...

By:  Tupaki Desk   |   28 Sep 2018 2:30 PM GMT
మొసలి కన్నీరంతా మంత్రి పదవి కోసమేనట...
X
ముందస్తు ఎన్నికలతో తెలంగాణ టీఆరెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను వీడడం లేదు. పరిస్థితులు క్లిష్టంగా ఉండడంతో అభ్యర్థులంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని... జనంలోనే తిరగాలని హైదరాబాద్ వైపు రావొద్దని ఇప్పటికే కేసీఆర్ ఆదేశించడంతో నేతలంతా నియోజకవర్గాలను పట్టుకుని వేలాడుతున్నారు. అయితే.. ఆ క్రమంలో ఫిరాయింపు నేతలకు మాత్రం అనూహ్యమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రీసెంటుగా వరంగల్ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు అలాంటి పరిస్థితే ఎదురైంది. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన్ను అక్కడి ప్రజలు టీడీపీని ఎందుకు వీడావని అడిగారట. దానికి ఆయన.. ‘తల్లిలాంటి పార్టీని విడిచి రావడం నాక్కూడా ఇష్టం లేకుండే’ అంటూ పాపం తెగ బాధపడిపోయారట ఎర్రబెల్లి. అయితే... మంత్రి పదవే లక్ష్యంగా ఎర్రబెల్లి ఎవరేమన్నా పట్టించుకోకుండా తుడుచుకుని వెళ్లిపోతున్నారని వరంగల్ టీఆరెస్ నేతలే అంటున్నారు.

ఎర్రబెల్లి టీఆరెస్ లోకి వచ్చినప్పుడు ఈ సారి ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారట. అందుకే.. ప్రశ్నించిన జనాలను బతిమిలాడుతూ.. అసమ్మతిని బుజ్జగిస్తూ.. రైతులతో చెలిమిచేస్తూ.. పనివాళ్లతో పనివాడిగా మారిపోతూ ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు నియోజకవర్గంలో గెలుపు కోసం తెగ కష్టపడుతున్నారట. నియోజకవర్గం దాటి కాలు బయట పెట్టడం లేదట.

నిజానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక్కటే మంత్రి పదవి ఇవ్వడం ఆనవాయితీ. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కడియం కీలకంగా ఉన్నారు. వచ్చేసారి గెలిస్తే ఎర్రబెల్లికి ఇవ్వాలి. అందుకే పొమ్మనలేక కొండా సురేఖ వంటి రెబల్ స్టార్ కు పొగ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. కొండా లాంటి బలమైన నేతలుంటే స్వేచ్చగా పనులు చేసుకోలేమనే…. ఆమె కోరికలను ఆసరా చేసుకొని టీఆర్ ఎస్ అధిష్టానం సాగనంపారనే వాదన వినిపిస్తోంది. ఇందులో వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు - ఆయన సోదరుడు - ఇతర ముఖ్య నేతలు కూడా ప్రోత్సాహం అందించారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మంత్రి పదవి కోసం ఎర్రబెల్లి దేనికైన సిద్ధమనేలా ఉన్నారు.