Begin typing your search above and press return to search.

టీడీపీ మళ్లీ పాత కంప్లయింటే..

By:  Tupaki Desk   |   26 Jun 2015 11:01 AM GMT
టీడీపీ మళ్లీ పాత కంప్లయింటే..
X
తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంపై టీడీపీ ఇంకా పట్టువీడలేదు. తమ పార్టీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీటీడీపీ నాయకులు తాజాగా స్పీకర్ మధుసూదనాచారికి వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, తెలంగాణ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పీకర్ ను ఆయన ఇంట్లోనే కలిసి వినతిపత్రమిచ్చారు.

కేసీఆర్‌ తెలంగాణను మిగతా రాష్ట్రాలకు భిన్నమైనదిగా భావిస్తున్నట్లుగా అనిపిస్తోందని... ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడం వంటి అంశాలపై సభాపతి దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. టీఆర్ఎస్‌లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. తమ పార్టీ టిక్కెట్ పైన గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయకుండానే తెలంగాణ ప్రభుత్వం కేబినెట్లో మంత్రిగా ఎలా ఉంటారని ప్రశ్నించారు.

అయితే... ఓటుకు నోటు వ్యవహారం మంచి వేడిగా ఉన్న సమయంలో టీటీడీపీ దానిపై దృష్టి పెట్టకుండా ఇలా అరిగిపోయిన పాత విషయంపై దృష్టి పెట్టడం అనవసరమంటున్నారు రాజకీయ పండితులు. ఇప్పటికే స్పీకర్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తని సంగతి తెలిసిందే. అలాంటప్పుడు ఇంత కీలక సమయంలో పాత విషయాన్ని.. పెద్దగా ప్రభావాన్ని చూపలేని అంశాన్ని ఎత్తుకోకుండా తాజా అంశాలపై పదునుగా వ్యవహరిస్తే మంచిదన్న భావన వ్యక్తమవుతోంది.