Begin typing your search above and press return to search.

మాజీ తమ్ముడి పొగడ్తల టాలెంట్..గులాబీ నేతల అవాక్కు

By:  Tupaki Desk   |   14 March 2020 5:02 AM GMT
మాజీ తమ్ముడి పొగడ్తల టాలెంట్..గులాబీ నేతల అవాక్కు
X
పొగడ్త కూడా టాలెంటే. ఎప్పుడెలా పొగడాలో.. పొగడ్తలతో ఎంతలా దూసుకెళ్లొచ్చన్నది అంత తేలికైన విషయం కాదు. చాలామంది నేతలు పొగడ్త కూడా పెద్ద కళేగా అని తీసిపారేస్తుంటారు కానీ.. తమవరకూ వచ్చేవరకూ దాన్ని ప్రదర్శించలేక వెనుకపడిపోతుంటారు. ఇందుకు భిన్నంగా కొందరు మాత్రం దూసుకెళుతుంటారు. తాజాగా అలాంటి దూకుడు ప్రదర్శిస్తూ గులాబీనేతలకు ఒక పట్టాన మింగుడుపడని రీతిలో మారుతున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కమ్ మాజీ తెలుగు తమ్ముడు ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఉద్యమవేళ కేసీఆర్ పై విపరీతంగా విరుచుకుపడిన నేతల్లో ఎర్రబెల్లి ఒకరుగా చెప్పాలి. మారిన కాలానికి తగ్గట్లు తనను తాను మార్చుకొని సైకిల్ దిగేసి.. కారు ఎక్కేసిన ఆయన.. సారు మనసు దోచేసి మంత్రి పదవిని సైతం సొంతం చేసుకున్నారు. కేసీఆర్ మీద ఈగవాలినా ఊరుకోనన్నట్లుగా అసెంబ్లీలో వ్యవహరిస్తూ.. అధికారపక్షానికి అప్పుడప్పుడు ఆత్మరక్షణలో పడేసేలా చేసినా.. తనకున్న పొగిడే టాలెంట్ తో.. తన తప్పుల్ని అధినేత మర్చిపోయేలా చేస్తుంటారు.

మొన్నటికి మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా అవసరం లేకున్నా జోక్యం చేసుకొన్న ఎర్రబెల్లి కారణంగా సీఎం కేసీఆర్ విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కారణంగా ఎర్రబెల్లికి క్లాస్ పడినట్లుగా చెబుతారు. ఇది జరిగి.. నాలుగైదు రోజలు కూడా కాలేదు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిని అవాక్కు అయ్యేలా చేస్తున్నాయి. పల్లె ప్రగతి కోసం మహాత్మాగాంధీ కన్న కలలు నిజం చేస్తున్నారంటూ కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

అక్కడితో ఆగితే ఆయన ఎర్రబెల్లి ఎందుకు అవుతారు? కేసీఆర్ మమాత్ముడి తర్వాత మరో గాంధీగా మారినట్లుగా ప్రశంసించి.. ఇంతలా కూడా పొగిడేయొచ్చా? అన్న భావన కలిగేలా చేస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత తెలంగాణ గ్రామాల్ని ఆదర్శ పల్లెలుగా మార్చటంలో పాటు స్వయం సమృద్ధిని సాధించే దిశలో కేసీఆర్‌ వినూత్నమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల గురించి ఇంతగా ఆలోచించే ముఖ్యమంత్రిని తాను చూడలేదన్న ఎర్రబెల్లి మాటలు గులాబీ పార్టీ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తామెంతలా ట్రై చేస్తున్నా ఎర్రబెల్లి మాదిరి ఇన్నోవేటివ్ గా పొగడలేకపోతున్నట్లు వారు వాపోతున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. పొగడ్తలతో సారును ఆకాశానికి ఎత్తేస్తున్న ఎర్రబెల్లివారి తీరు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.