Begin typing your search above and press return to search.

కొత్త చ‌ర్చ‌!... ఎవ‌రి కింద ఎవ‌రు?

By:  Tupaki Desk   |   18 March 2019 4:04 AM GMT
కొత్త చ‌ర్చ‌!... ఎవ‌రి కింద ఎవ‌రు?
X
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు స‌రికొత్త చ‌ర్చ జ‌రుగుతోంద‌ని చెప్పాలి. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత తెలంగాణ‌కు టీఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు సీఎం కాగా... ఉమ్మ‌డి రాష్ట్రానికి తొమ్మిదిన్న‌రేళ్ల పాటు సీఎంగా వ్య‌హ‌రించిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు... ప‌దేళ్ల త‌ర్వాత తిరిగి ఏపీకి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఇరు రాష్ట్రాల మ‌ధ్య త‌ర‌చూ వివిదాలు నెల‌కొంటున్నాయి. మొన్న‌టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ప్ర‌చారం చేసేందుకు వెళ్లిన చంద్ర‌బాబు... త‌న‌ను కేసీఆర్ విమ‌ర్శించ‌డంపై త‌న‌దైన శైలి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే *నా కింద ప‌నిచేసే వాళ్లు త‌న‌ను విమ‌ర్శించడ‌మా?* అంటూ ఆయ‌న ఓ కొత్త ప‌దాన్ని అందుకున్నారు. తాజాగా ఏపీ ఎన్నికల ప్ర‌చారంలోనూ చంద్ర‌బాబు ఇదే మాట‌ను వినిపించారు. అప్ప‌టిదాకా ఈ విష‌యాన్ని అంత‌గా ప‌ట్టించుకోని టీఆర్ ఎస్ నేత‌లు... ఒక్క‌సారిగా విరుచుకుప‌డేందుకు సిద్ధ‌మ‌య్యారు. *నా కింద ప‌నిచేసిన వాళ్లు* అంటూ చంద్ర‌బాబు సంధించిన కామెంట్ల‌కు ఇప్పుడు గ‌తంలో టీడీపీలోనే కొన‌సాగి... ఇప్పుడు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా - కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కొన‌సాగుతున్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు... ఈ విష‌యంపై త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు గుప్పించారు. తాను గానీ - కేసీఆర్ గానీ చంద్రబాబు కింద ప‌నిచేయ‌లేద‌ని - అంత‌గా చెప్పాల్సి వ‌స్తే... చంద్ర‌బాబే త‌మ కింద ప‌నిచేశార‌ని ఆయ‌న నిన్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఎర్ర‌బెల్లి మాటేమో గానీ... ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర లేసింది. అస‌లు ఎవ‌రి కింద ఎవ‌రు ప‌నిచేశారు? అన్న విష‌యంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌నంద‌రికీ తెలిసిన‌ట్టుగా కేసీఆర్ 1975లోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. విద్యార్థిగా ఉండ‌గానే రాజ‌కీయాల‌పై మ‌క్కువ‌తో ఆయ‌న పాలిటిక్స్‌ లో యాక్టివ్‌ గా ఉండేవారు. 1975లో దేశంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని నియ‌మించ‌గానే... ఢిల్లీ వెళ్లిపోయిన కేసీఆర్‌... సంజ‌య్ విచార్ మంచ్ లో చేరారు. ఆ త‌ర్వాత ఓ ఐదేళ్ల పాటు అక్క‌డే ఉన్న ఆయ‌న సంజ‌య్ గాంధీ మ‌ర‌ణించాక తిరిగి సిద్దిపేటకు వ‌చ్చారు. ఓ రెండేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగిన కేసీఆర్‌... ఆ త‌ర్వాత 1982లో నంద‌మూరి తార‌క‌రామారావు తెలుగు దేశం పార్టీ పేరిట రాజ‌కీయ పార్టీ పెట్టగానే దానిలో చేరిపోయారు. 1983లో టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు. ఆ త‌ర్వాత 1985లో టీడీపీ త‌ర‌ఫున ఎన్నికైన కేసీఆర్‌... ఆ త‌ర్వాత ఓట‌మి ఎరుగ‌ని నేత‌గానే కొన‌సాగుతున్నారు. 1987-88లో ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు.

ఇక చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే... 1977లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన చంద్ర‌బాబు తొలి సారే ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటుగా ఏకంగా మినిస్ట‌ర్ కూడా అయ్యారు. ఆ త‌ర్వాత 1983లో ఓట‌మిపాలైన చంద్ర‌బాబు.. ఓ ఐదేళ్ల పాటు ఖాళీగానే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరిని వ‌దిలేసి కుప్పం వెళ్లిపోయారు. అప్ప‌టినుంచి కుప్పం నుంచే పోటీ చేస్తూ వ‌స్తున్న ఆయ‌న గెలుస్తూనే వ‌స్తున్నారు. టీడీపీని ఎన్టీఆర్ లాగేసుకున్న త‌ర్వాత కేసీఆర్‌ కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోగా... ఉద్య‌మం వైపు న‌డిచిన కేసీఆర్ టీఆర్ ఎస్‌ ను స్థాపించారు. మ‌రి ఈ లెక్క‌న టీడీపీలో చంద్ర‌బాబు కంటే కేసీఆరే సీనియ‌ర్ కింద లెక్క‌. ఇక చంద్ర‌బాబు కేబినెట్ లో మంత్రిగా లేని కేసీఆర్‌... అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌ గా వ్య‌వ‌హ‌రించారు. ఈ లెక్క‌న చంద్ర‌బాబు కింద కేసీఆర్ ప‌నిచేయ‌న‌ట్టే లెక్క‌. అయితే ఓ పార్టీ అధినేత‌గా ఉన్న చంద్ర‌బాబు... ఆ కోణంలో చంద్ర‌బాబు పైన ఉన్న‌ట్టేన‌ని చెప్పాలి. ఈ లెక్క‌న చంద్ర‌బాబు చేస్తున్న వాద‌న‌లో పెద్ద‌గా ప‌స లేద‌నే చెప్పాలి. ఈ లెక్క‌లు తీసిన క్ర‌మంలోనే ఎర్ర‌బెల్లి ఈ కొత్త వాద‌న‌ను వినిపించారు. మ‌రి ఎవ‌రు - ఎవ‌రి కింద ప‌నిచేశార‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టేసి... ఎవ‌రి రాజ‌కీయాలు వారు చేసుకుంటే మంచిద‌న్న వాద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.