Begin typing your search above and press return to search.

ఈటెల మాటలకు భుజాలు తడుముకోవాలా ఎర్రబెల్లి

By:  Tupaki Desk   |   31 Aug 2019 11:15 AM GMT
ఈటెల మాటలకు భుజాలు తడుముకోవాలా ఎర్రబెల్లి
X
కేసీఆర్ వర్సెస్ ఈటెల మధ్య ఏదేదో రచ్చ జరుగుతున్నట్లుగా మీడియాలో వార్తలు రావటం.. ఆ వెంటనే సోషల్ మీడియాలో ఇరు వర్గాలకు చెందిన వారు చెలరేగిపోవటం.. అసలోళ్ల కన్నా కొసరోళ్ల లొల్లే ఎక్కువగా ఉందన్న మాట మస్తుగా వినిపిస్తున్న వేళ.. ఉద్యమకారుడు ఒక్కసారిగా నిద్ర లేవటంతో ఈటెల ఒళ్లు విరుచుకొని.. ఈటెల్లాంటి మాటలతో దుమ్ము దులిపేశాడు.

గులాబీ జెండాకు మేమే ఓనర్లమన్న భారీ మాటను అనటం ద్వారా కేసీఆర్ క్యాంప్ నకు సైతం దిమ్మ తిరిగే షాకిచ్చాడు. అంత పెద్ద హరీష్ అనేటోడు సైతం.. తనను అదే పనిగా అవమానిస్తున్నా కిమ్మనకుండా ఉంటే.. ఈటెల మాత్రం అందుకు భిన్నంగా సగటు ఉద్యమకారుడు ఎలా రియాక్ట్ అవుతాడో అదే తీరుతో స్పందించిన తీరు వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కిపోయేలా చేసింది.

అయితే.. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈటెల మాట్లాడిన మాటల్ని పేపర్లోనో.. మరో మీడియా మాధ్యమంలో వినకుండా.. ఆయన మాటల్ని యథాతధంగా ఆడియో రికార్డును వింటే.. ఎక్కడా ఆయన దొరకరు సరికదా.. ఆవేదనతో మాట్లాడినట్లు ఉంటుందే తప్పించి కేసీఆర్ మీద ఏదో సమరశంఖం పూరించినట్లుగా ఉండదు. ఆయన మాటల క్లిప్ ను విన్నప్పుడు ఈటెల లోని తెలివి ఎంతన్నది కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు.

తన మాటల్లో ఒక్క తప్పు దొర్లకుండా జాగ్రత్తపడ్డ ఈటెల..మిగిలిన వారి మాదిరి ఆడుకోవాలని భావిస్తే లెక్క తేలుస్తా బిడ్డా.. అన్న రీతిలో ఓనర్ల సందేశాన్ని ఇవ్వటం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే.. గులాబీ జెండాలకు ఓనర్లం మేమే అన్నది.. తెలంగాణ ఉద్యమకారుడిగా.. తెలంగాణ సాధన కోసం పోరాడిన టీఆర్ఎస్ నేతల్లో కీలకమైన నేతగా తనను తాను క్లెయిమ్ చేసుకోవటం కనిపిస్తుంది.

ఈ విషయాన్ని అంతటితో వదిలేస్తే బాగుండేది. ఏమైందో ఏమో కానీ.. ఈటల మాటల్ని తప్ప పట్టారు మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే బాస్ అంటూ ఆయన చేసిన తాజా మాట ఆసక్తికరంగానే కాదు.. కొత్త చర్చకు తెర తీసేలా ఉంది. తెలంగాణ భవన్ లో టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గులాబీ జెండాను కేసీఆర్ ఒక్కరే తయారు చేశారని.. తానుకూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తూ లేఖ ఇప్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు.. గులాబీ జెండాకు ఓనర్లు మేమే అన్న విషయాన్ని ఇప్పుడు ఎర్రబెల్లి తప్ప పట్టాల్సిన అవసరం ఏమిటి? గులాబీ ఓనర్ అన్నాడే కానీ.. కేసీఆర్ కాదని ఈటెల అనలేదు సరికదా? అయిన పెళ్లికి మేళాల మాదిరి.. ఈటెల ఓనర్ల మాట మీద జరగాల్సిన చర్చ జరిగిపోయిన తర్వాత ఇప్పుడిలా స్పందించాల్సిన అవసరం ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.