Begin typing your search above and press return to search.

కేటీఆర్ సాబ్‌...మీ స‌వాల్ తిరిగి వ‌చ్చింది

By:  Tupaki Desk   |   11 Jan 2016 10:35 AM GMT
కేటీఆర్ సాబ్‌...మీ స‌వాల్ తిరిగి వ‌చ్చింది
X
"గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ వంద సీట్ల‌కు పైగా గెల‌వ‌క‌పోతే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తా? ప‌్ర‌తిప‌క్షాల నేత‌లు ఇందుకు సిద్ధ‌మా? " తెలంగాణ మంత్రి కేటీఆర్ విసిరిన స‌వాల్ ఇది. దీనికి ప్ర‌తిప‌క్షాల టీమ్‌లో కీల‌క‌పార్టీలైన టీడీపీ-బీజేపీ వెంట‌నే స్పందించాయి. నిజాం కాలేజీ గ్రౌండ్‌ లో రేపు జ‌ర‌గ‌నున్న బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన టీడీపీ-బీజేపీ నేత‌ల‌ను మీడియా క‌దిలించ‌గా ఇరు పార్టీల నాయ‌కులు ఘాటుగా స్పందించారు.

హైదరాబాద్ గురించి మాట్లాడుతున్న‌ కేటీఆర్ ఈ న‌గ‌రానికి చేసిందేమిటని టీడీపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు ఎల్‌. రమణ ప్రశ్నించారు. టీడీపీ- బీజేపీ పై అసత్య ప్రచారాలతో లబ్ధిపొందాలని చూస్తున్నారని అరోపించారు. జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో విపక్షాలపై లేనిపోని అసత్య ఆరోపణలు చేసి గెలుపొందాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ... టీడీపీ-బీజేపీ కూటమిని ఓడించేందుకు టీఆర్‌ ఎస్‌ కుట్రలు పన్నుతుందని అన్నారు. గ్రేటర్‌ లో టీఆర్‌ ఎస్‌ గెలిస్తే ఎంఐఎం అజెండానే అమలు చేస్తారని అన్నారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ పని విధానంపై త్వ‌ర‌లో వాస్త‌వాలు బ‌య‌ట‌పెడ‌తామ‌ని చెప్పారు. ప్రధాని న‌రేంద్ర‌మోడీ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడని, కేటీఆర్‌ ప్రధానిని విమర్శించడం తగదన్నారు

టీడీపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ మేం గెలిస్తే సీమాంధ్రులకే డిప్యూటీ మేయర్‌ అని ప్ర‌క‌టించారు. హైదరాబాద్‌ ను అభివృద్ధి చేసింది సీమాంధ్రులేనని అందుకే తామీ ఆలోచ‌న చేశామ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే కేటీఆర్ రాజీనామా సవాలుపై ఎర్రబెల్లి స్పందించారు. గ్రేట‌ర్ ఎన్నిక‌లు కాదు... పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన సవాల్‌ చేశారు. టీడీపీ-బీజేపీలను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్‌ ఇలాంటి విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు.