Begin typing your search above and press return to search.

టీడీపీలో తిరిగిచేర‌డంపై ఎర్ర‌బెల్లి మాట విన్నారా?

By:  Tupaki Desk   |   4 Feb 2017 11:09 AM GMT
టీడీపీలో తిరిగిచేర‌డంపై ఎర్ర‌బెల్లి మాట విన్నారా?
X

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయ‌కుడిగా ఉండి గ‌త ఏడాది టీఆర్ ఎస్‌ లో చేరిన సీనియ‌ర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మళ్ళీ టీడీపీలో చేరతార‌ని ఓ ప‌త్రికలో క‌థ‌నం వ‌చ్చిన నేప‌థ్యంలో ఎర్ర‌బెల్లి ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ త‌ర‌హా ప్ర‌చారాన్ని తాను ఖండిస్తున్నానని ఎర్ర‌బెల్లి తెలిపారు. త‌న‌ను రాజకీయంగా దెబ్బతీయడానికి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమ‌ర్శించారు. తాను, టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్ .రమణ కలుసుకున్న మాట నిజమే చెప్పిన ఎర్ర‌బెల్లి త‌మ ఇద్దరి మధ్య స్నేహం రాజకీయాలకు ఆతీతమైనదని తెలిపారు. త‌మ భేటీకి రాజకీయాలు ఆపాదించడం అర్థరహితమ‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ ప్ర‌చారం వెనుక తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నార‌ని ఎర్ర‌బెల్లి ఆక్షేపించారు. రేవంత్ రెడ్డిది మొదట్నుంచి సంకుచిత మనస్తత్వమేన‌ని మండిప‌డ్డారు. నిరాధారమైన వార్తను సృష్టించి నన్ను రాజకీయంగా బద్నాం చేయాలంటే సాధ్యం కాదు, బోగస్ ప్రచారం చేయడం లో రేవంత్ దిట్ట , అలాంటి వ్యూహాలతోనే ఏదుగుతానని రేవంత్ భ్రమిస్తున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం రాత్రిళ్ళు ఎవరు ఎవరిళ్ళకు వెళతారో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారో అందరికి తెలుసున‌ని ఎర్ర‌బెల్లి త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

బీజేపీ మొదలుకొని రేవంత్ ఎన్ని పార్టీలు మారారో ఆందరికీ తెలుసున‌ని ఎర్ర‌బెల్లి ఎద్దేవా చేశారు. టీడీపీలో ఉంటూ ఆ పార్టీ అధినేత‌ చంద్రబాబు నాయుడునే బ్లాక్ మెయిల్ చేస్తూ రేవంత్ బతుకుతున్నాడనే చర్చ జరుగుతోందని ఎర్ర‌బెల్లి తెలిపారు. ఓటుకు నోటు కేసులో అప్రూవర్ గా మారుతానంటూ పార్టీ అధినేత చంద్రబాబునే రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ టీడీపీ వర్గాలు చెబుతున్నాయని ఎర్ర‌బెల్లి వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండ‌గా..తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెదేపా అధ్యక్షుడు ఎల్‌. రమణ మండిప‌డ్డారు. తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కహామీ అమలుకావడంలేదని విమ‌ర్శించారు. పేదలు మరింత సమస్యల్లోకి నెట్టివేయబడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్‌ బూటకపు హామీలను ప్రజలకు వివరిస్తామ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో మొదటి విడతగా బహిరంగసభ చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఒత్తిడి తీసుకురావడం వల్లే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/