Begin typing your search above and press return to search.

ఎర్ర‌బెల్లి చెప్పిన ఆజంజాహి సెంటిమెంట్ ఏమిటి?

By:  Tupaki Desk   |   3 April 2019 4:46 AM GMT
ఎర్ర‌బెల్లి చెప్పిన ఆజంజాహి సెంటిమెంట్ ఏమిటి?
X
కొన్ని మాట‌లు కొన్ని సంద‌ర్భాల్లో అస్స‌లు సూట్ కావు. అధినేత మ‌న‌సు దోచుకోవ‌టానికి.. ఆయ‌న మాట‌ల్ని వినేందుకు భారీగా వ‌చ్చిన జ‌న‌సందోహానికి కొత్త ఉత్సాహాన్ని తెచ్చేందుకు నేత‌లు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఈ సంద‌ర్భంగా వారు చేసే వ్యాఖ్య‌లు కొత్త ఇబ్బందుల‌కు తెర తీయ‌ట‌మే కాదు.. ఇరుకున ప‌డేసే అవ‌కాశం ఉంటుంది. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.

వ‌రంగ‌ల్ లో నిర్వ‌హించిన స‌భ‌లో రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆస‌క్తిక‌ర ముచ్చ‌ట ఒక‌టి ప్ర‌స్తావించారు. ఆజంజాహి మిల్స్ గ్రౌండ్స్ లో ఎన్నిక‌ల స‌భ‌ను నిర్వ‌హించిన వారంతా ప్ర‌ధాన‌మంత్రుల‌య్యార‌ని... కేసీఆర్ సైతం త‌ప్ప‌కుండా పీఎం అవుతార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఆజంజాహి మైదానంలో ఎన్నిక‌ల స‌భ నిర్వ‌హించిన నెహ్రూ.. పీవీ న‌ర‌సింహారావులు ప్ర‌ధానులు అయ్యార‌ని.. అదే లెక్క‌న కేసీఆర్ సైతం ప్ర‌ధాని కావ‌టం ఖాయ‌మ‌ని తేల్చేశారు. ఆయ‌న హుషారు కేసీఆర్ కు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే.. కేసీఆర్ ప్ర‌ధాని అవుతారా? లేదా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న కాదు.

ఎందుకంటే.. కేసీఆర్ ప్ర‌ధాని అయితే.. రాష్ట్ర ప‌గ్గాలు ఎవ‌రి చేతుల్లో అన్న చ‌ర్చ ట‌క్కున స్టార్ట్ అవుతుంది. దాంతో మొద‌ల‌య్యే ఇబ్బందులు ఒక ఎత్తు అయితే.. ప్ర‌ధాని రేసులో కేసీఆర్ ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగితే.. తృతీయ కూట‌మితో చ‌క్రం తిప్పాల‌న్న కేసీఆర్ ఆశలు ఆవిరి కావ‌టం ఖాయం.

ఎందుకంటే.. 16 సీట్ల (అస‌ద్ సీటుతో క‌లిపి 17 అనుకున్నా)తోనే ప్ర‌ధాని కావొచ్చ‌న్న ఫీలింగ్ కేసీఆర్ కు ఉంటే.. ఆ ప‌ద‌వి కోసం క‌న్నేసిన ఎంతోమంతి ప్రాంతీయ నాయ‌కుల ప‌రిస్థితి ఏమై పోవాలి? అలూ లేదు చూలు లేదు మొగుడు పేరు సోమ‌లింగం అన్న చందంగా.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌ట్లోనే ఈ త‌ర‌హా ప్ర‌చారం కేసీఆర్ కు అస్స‌లు మంచిది కాదు.

అందుకే.. ఎర్ర‌బెల్లి మాట‌ల‌కు ఉలిక్కిప‌డిన కేసీఆర్ ఆయ‌న మాట‌ల్ని స‌ర్దే ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌కు ప్ర‌ధాన‌మంత్రి కావాల‌న్న ఆశ లేద‌ని కొట్టిపారేసే ప్ర‌య‌త్నం చేశారు. అయినా.. ఎవ‌రూ కూడా తాను ప్ర‌ధాని కావాల‌ని నేరుగా చెప్ప‌లేరు. సొంత నాయ‌కుల నోటి నుంచి ప్ర‌ధాని అనిపించుకోవ‌టం అంత బాగోదు కూడా. అందుకే.. కేసీఆర్ ముందు చూపును ప్ర‌ద‌ర్శించి త‌న‌కు ప్ర‌ధాని ప‌ద‌వి మీద ఆశ లేదన్న రాగాన్ని వినిపించారు. ఎర్ర‌బెల్లి సెంటిమెంట్ మాట‌లు.. కేసీఆర్ ఆయింట్ మెంట్ వ్యాఖ్య‌ల్ని కాసేపు వ‌దిలేద్దాం. ఎన్నో ఏళ్లుగా ఎవ‌రికి ప‌ట్ట‌ని ఆజంజాహి మిల్స్ గ్రౌండ్స్ లో చెట్లు కొట్టేయించి.. స‌భ‌కు త‌గ్గ‌ట్లుగా మైదానాన్ని సిద్ధం చేయించ‌టం వెనుక అస‌లు క‌థేమిట‌న్న రాజ‌కీయ వ‌ర్గాల చ‌ర్చ‌కు స‌మాధానం చెప్పే వారెవ‌రు?