Begin typing your search above and press return to search.

మంత్రి అయిన ఎర్ర‌బెల్లి

By:  Tupaki Desk   |   27 Feb 2016 5:49 AM GMT
మంత్రి అయిన ఎర్ర‌బెల్లి
X
ఎర్రబెల్లి దయాకరరావు...తెలుగుదేశం పార్టీని వీడి అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో లాంచ‌నంగా చేరి రెండ్రోజులు కూడా కాలేదు. కానీ ఆయ‌న మంత్రి హోదా పొందారు. ఏకంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో స‌మానంగా వేదిక పంచుకున్నారు. అంతే కాదండోయ్ రోజంతా జ‌రిగిన స‌మీక్ష‌లో భాగ‌మ‌వ‌డ‌మే కాకుండా అధికారుల‌కు ప్ర‌శ్న‌లు కూడా సంధించారు. ఏంటి నిజ‌మే. ఇదంతా ఎప్పుడు జ‌రిగింది అనుకుంటున్నారు. అక్క‌డికే వ‌స్తున్నాం.

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌ మిషన్‌ భగీరథపై హైద‌రాబాద్‌ లోని మ‌ర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశానికి సీఎం కేసీఆర్‌ తో పాటు ఇంధనశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి హాజరుకాగా ఆయన ప‌క్క‌నే ఎర్రబెల్లి దయాకరరావు కూర్చున్నారు. మిషన్‌ భగీరథ‌పై కేసీఆర్‌ సుదీర్ఘ ప్రసంగం చేశాక అధికారులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంలో ఎర్రబెల్లి దయాకరరావు అధికారులకు కొన్ని ప్రశ్నలు సంధించినట్లు స‌మాచారం. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలా, లేదా అన్నది అధికారులు తేల్చుకోలేకపోయారట‌. ముఖ్యమంత్రి సమక్షంలో ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం ఇవ్వక తప్పదని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్న భయంతో ఎర్రబెల్లి ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం అధ్యక్షతన జరిగే ఏ ఉన్నత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరుకారని, ఒకవేళ వచ్చినా సీఎం - మంత్రులతో మాట్లాడి వెళ్లిపోతారని ఎర్రబెల్లి మాత్రం ప్రారంభం నుంచి చివరిదాకా ఈ సమావేశంలో కూర్చోనడం సీఎంతోపాటే ఆయన కూడా వెళ్ళిపోయార‌ని అధికారులు అంటున్నారు.

త్వరలో జరిగే మంత్రివర్గ విస్థరణలో ఎర్రబెల్లికి మంత్రిపదవి ఖాయమన్న ప్రచారం జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన సమావేశానికి ఆయన హాజరుకావడం రాజకీయ వర్గాల్లో సంచలనం క‌లిగిస్తోంది. చూస్తుంటే ఎర్ర‌బెల్లికి కీల‌క బెర్తు ఖ‌రారైన‌ట్లేన‌ని చ‌ర్చ‌లు మ‌రింత జోరందుకున్నాయ‌.