Begin typing your search above and press return to search.

అద్దంలా మెరుస్తున్న ఎర్రవెల్లి రోడ్లు

By:  Tupaki Desk   |   25 Dec 2015 4:36 AM GMT
అద్దంలా మెరుస్తున్న ఎర్రవెల్లి రోడ్లు
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చాలా భిన్నం. ఆయన్ను అంచనా వేయటం ఒక పట్టాన సాధ్యం కాదు. ఆయన ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఆయన సన్నిహితులు కూడా అర్థం కాని పరిస్థితి. ఇక.. ఆయన మాటలకు.. చేతలకు పొంతన ఉండదన్నది తెలిసిందే. అదేసమయంలో.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆయన చేతలు మాటలకు మించి పోవటం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పాలనా పగ్గాలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ మహానగరం గురించి ఆయన చాలానే చెప్పారు.

కొన్ని సందర్భాల్లో అయితే.. తన కలలకు తగిన గ్రాఫిక్స్ ఫోటోల్ని విడుదల చేసి.. తనతో పాటు నగర వాసుల్ని సైతం స్వప్న లోకాల్లో విహరించేలా చేశారు. పెద్ద పెద్ద భవనాల్ని త్వరలో నిర్మిస్తామని.. దాంతో హైదరాబాద్ రూపు రేఖలు మార్చేస్తామంటూ చాలానే మాటలు చెప్పారు. ఇక.. హైదరాబాద్ రోడ్లను అద్దంలా తయారు చేస్తామని చెబితే.. కేసీఆర్ మాటలకు మించి నాటి గ్రేటర్ కమిషనర్ సోమేష్ కుమార్ అయితే.. హైదరాబాద్ రోడ్ల మీద గుంతలు చూపిస్తే.. గుంతకు వెయ్యి చొప్పున ఇస్తామని ప్రకటించారు కూడా. ఆయన అలాంటి మాటలు చెప్పి ఏడాదికి పైనే అయిపోయింది. ఆయనిప్పుడు గ్రేటర్ కమిషనర్ పదవిలో కూడా లేరు. కానీ.. ఆయన చెప్పిన గుంతల్లేని రోడ్ల కోసం నగరవాసులు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అయుత చండీయాగంలో భాగంగా యాగం జరుగుతున్న ఎర్రవెల్లికి వెళ్లేందుకు వీలుగా చేసిన ఏర్పాట్లు.. నిర్మించిన రోడ్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. కేసీఆర్ చెబుతుంటే అద్దంలాంటి రోడ్లు అంటే ఎలా ఉంటాయో.. తన చేతల్లో చేసి చూపించారు. దాదాపు రూ.30కోట్ల వ్యయంతో తారు రోడ్లను యుద్ధప్రాతిపదిక ఏర్పాటు చేశారు. జగదేవపూరు.. తూప్రాన్ రోడ్లతో పాటు.. యాగానికి వెళ్లే నర్సస్నపేట మలుపు వరకు తయారు చేసిన రెండు వరుసల తారు రోడ్లను చూసిన ఎవరైనా.. తమ ఊళ్లల్లో ఇలాంటి రోడ్లు ఎందుకు లేవని అసూయ చెందాల్సిందే. యాగస్థలి వరకు వేసిన ఈ సరికొత్త రోడ్లు చూసిన నగరవాసులకు అద్దల్లాంటి రోడ్లు ఎలా ఉంటాయో అర్థం చేసుకుంటున్నారు. అద్దం లాంటి రోడ్లు హైదరాబాద్ లో వేస్తానని చెప్పి.. ఎర్రవెల్లిలో వేయుడేంటి..?