Begin typing your search above and press return to search.

విపక్షాలు రావొద్దంటూ ఎర్రవల్లిలో బోర్డులు

By:  Tupaki Desk   |   3 Aug 2016 5:23 AM GMT
విపక్షాలు రావొద్దంటూ ఎర్రవల్లిలో బోర్డులు
X
తెలంగాణ రాష్ట్ర సర్కారు గడిచిన రెండేళ్ల వ్యవధిలో ఎప్పుడూ ఎదుర్కోనంత ఇబ్బందికర పరిస్థితిని మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ఎదుర్కొంది. ఒకదశలో మల్లన్నసాగర్ పేరు ఎత్తితేనే ఉలిక్కిపడే పరిస్థితి. సమర్థుడిగా పేరున్న మంత్రి హరీశ్ సైతం ఈ ప్రాజెక్టు మీద వెల్లువెత్తిన నిరసనల్నికంట్రోల్ చేయలేక బిక్కముఖం వేసిన పరిస్థితి. ఫైర్ బ్రాండ్ మాదిరి మాటల్ని తూటాల్లా సంధించే హరీశ్ స్వరం సైతం విపక్షాలు పోరుతో తడబడే పరిస్థితి. అయితే.. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్ని అధిగమించేందుకు తన శక్తియుక్తులు మొత్తాన్ని బయటకు తీసి మరీ ప్రయత్నాలు షురూ చేసిన హరీశ్.. ఆ ప్రయత్నంలో సక్సస్ అయ్యారనే చెప్పాలి.

చేతిలో ఉన్న పవర్ తో మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోకి విపక్ష నేతలు ఎవరూ వచ్చే అవకాశం లేకుండా చేయటమే కాదు.. అక్కడి గ్రామస్థులతో వేర్వేరుగా భేటీ అయి.. వారికి ప్రభుత్వ పరంగా అందే సాయంపై ధీమా కలిగేలా అభయం ఇవ్వటమే కాదు.. ప్రాజెక్టుకు అవసరమైన భూమిని అక్కడి ప్రజల్ని ఒప్పించేందుకు చాలానే ప్రయత్నాలు చేశారు. మొత్తం ఎనిమిది ముంపు గ్రామాల్లో ఏడు గ్రామాల వారు తమ భూములు ఇచ్చేసే పరిస్థితి.

ఇదిలా ఉంటే.. దొరక్క దొరక్క తెలంగాణ అధికారపక్షానికి చిరాకు తెప్పించటంలో సక్సెస్ అయిన తెలంగాణ విపక్షాలు మల్లన్నసాగర్ ఇష్యూను మరింత ముదిరేలా చేసేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తున్నాయి. విపక్ష పార్టీలన్నీ కలిసి కట్టుగా వేదికల మీదకు వస్తూ.. తెలంగాణ అధికారపక్షం మీద ఫైర్ అవుతున్నాయి. మల్లన్నసాగర్ ఇష్యూలో ప్రజలకు అన్యాయం జరుగుతుందన్న గళాన్ని మరింత బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో మల్లన్నసాగర్ ముంపు గ్రామాల జాబితాలో ఉన్న ఎర్రవల్లిలో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలు తమ గ్రామంలోకి రావొద్దంటూ ప్రత్యేకంగా పలకల మీద రాసి మరీ.. ఊరి బయట ఉంచటం గమనార్హం. కాంగ్రెస్.. తెలుగుదేశం.. కమ్యూనిస్టులు తమకేమీ సాయం చేయాల్సిన అవసరం లేదని.. ఇప్పటివరకూ చేసిన లొల్లి చాలని.. రాజకీయాలు ఏమైనా ఉంటే ఊరి బయట చేసుకోవాలే కానీ.. ఊళ్లో మాత్రం ఆ ఇష్యూను తీసుకురావొద్దంటూ బోర్డులు పెట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది.

మల్లన్నసాగర్ ముంపుతో ఇప్పటికే తాము ఆగమయ్యామని.. విపక్షాలు తమను రెచ్చగొడుతున్నాయని.. తమకు 123జీవో నచ్చిందని. . మంత్రి హరీశ్ మీద నమ్మకం ఉందని చెబుతున్న ఎర్రవల్లి గ్రామస్తులు.. తాజాగా పెట్టిన బోర్డులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మల్లన్నసాగర్ ఇష్యూలో మరింత మైలేజీ పొందాలని భావిస్తున్న విపక్షాలకు ఈ బోర్డులు సరికొత్త షాకిస్తున్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు.