Begin typing your search above and press return to search.

తెలంగాణ సర్కారుకు ‘ఎర్రవల్లి’ షాక్

By:  Tupaki Desk   |   5 Aug 2016 8:14 AM GMT
తెలంగాణ సర్కారుకు ‘ఎర్రవల్లి’ షాక్
X
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఎంత వివాదంగా మారింతో తెలిసిందే. ఈ ప్రాజెక్టు వ్యవహారంలో హైకోర్టు నుంచి బలమైన మొట్టికాయలు తిన్న తెలంగాణ ప్రభుత్వానికి.. తాజాగా ఈ ప్రాజెక్టులో భాగంగా ముంపునకు గురయ్యే ఎర్రవల్లి వాసులు సైతం దిమ్మ తిరిగే షాకిచ్చారు. మొన్నటి వరకూ జీవో నెంబరు 123 ప్రకారం తమ భూములు ఇచ్చేందుకు ఓకే అన్న గ్రామస్థులు.. తాజాగా హైకోర్టు వెలువరించిన తీర్పు అనంతరం వారు భూములు ఇచ్చేందుకు ససేమిరా అనటం గమనార్హం.

తొలుత భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ఎర్రవల్లి వాసులు.. తర్వాతి కాలంలో మంత్రి హరీశ్ సీన్లోకి వచ్చి.. వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని.. ఎవరినీ నష్టపోకుండా చూస్తామంటూ చెప్పిన మాటలతో వారు కన్వీన్స్ కావటమే కాదు.. ప్రభుత్వానికి తమ భూములు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా.. విపక్షాలు తమ గ్రామంలోకి రావొద్దంటూ ఎర్రవల్లి వాసులు బోర్డు పెట్టటం అందరిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే.. జీవో 123 మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎర్రవల్లిలో సీన్ రివర్స్ అయ్యింది.

నిన్నటిదాకా భూములు ఇస్తామన్న వారు.. ఇప్పుడు ఇవ్వమంటే ఇవ్వమని చెప్పటమే కాదు.. విపక్షాల్ని ఊళ్లోకి రావద్దన్న చందంగా.. దళారులకు.. ప్రభుత్వాధికారులకు ఖబడ్డార్ అని పేర్కొనటమే కాదు.. భూసేకరణ కోసం వచ్చిన అధికారుల్ని తిరిగి వెళ్లిపోవాలని స్పష్టం చేయటంతో వారు వెనుదిరగాల్సి వచ్చింది. జీవో నెంబరు 123ను హైకోర్టును కొట్టేసిన నేపథ్యంలో.. ఎవరూ భూములు ఇవ్వకూడదని నిర్ణయించటంతో పాటు.. హైకోర్టు తీర్పు రైతుల విజయంగా వారు టపాసులు కాల్చుకోవటం గమనార్హం. ఏది ఏమైనా ఎర్రవల్లి వాసులు తెలంగాణ సర్కారుకు షాకిచ్చారని చెప్పాలి.