Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్ః మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బ‌ర్త‌ర‌ఫ్‌!

By:  Tupaki Desk   |   2 May 2021 3:57 PM GMT
బిగ్ బ్రేకింగ్ః మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బ‌ర్త‌ర‌ఫ్‌!
X
తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ‌మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ను ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌రరావు బ‌ర్త‌ర‌ఫ్ చేశారు. సీఎం ఆదేశాల మేర‌కు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం గ‌వ‌ర్న‌ర్ కు లేఖ పంపిన‌ట్టు స‌మాచారం. ఈ లేఖ‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర వేసిన‌ట్టు తెలిసింది.

మెద‌క్ జిల్లా మూసాయిపేట మండ‌లంలోని అచ్చంపేట‌, హ‌కీంపేట గ్రామాల ప‌రిధిలోని అసైన్డ్ భూమిని ఆక్ర‌మించేందుకు ఈట‌ల ప్ర‌య‌త్నించార‌ని ప‌లువురు రైతులు ఫిర్యాదు చేసిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈట‌ల రాజేంద‌ర్ కు చెందిన జ‌మున హ్యాచ‌రీస్ ప‌క్క‌న ఉన్న అసైన్డ్ భూముల‌ను బ‌ల‌వంతంగా లాక్కున్నార‌ని, ప్ర‌శ్నిస్తే బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని రైతులు ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

ఈ విష‌యం తెలుసుకున్న సీఎం కేసీఆర్ విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీచేశారు. ఆయ‌న‌కు మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ ను ఆదేశించ‌డం.. ఆయ‌న రిపోర్ట్ పంపించ‌డం జ‌రిగిపోయాయి. ఈ రిపోర్టు ప్ర‌కారం క‌బ్జా విష‌యం నిజ‌మేన‌ని తేలిన‌ట్టు స‌మాచారం.

ఈ రిపోర్టు ప్ర‌కారం త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్న ముఖ్య‌మంత్రి.. ఈటల వ‌ద్ద ఉన్న వైద్యారోగ్య శాఖ‌ను త‌న ప‌రిధిలోకి తీసుకున్నారు. దీంతో.. శ‌నివార‌మే ఈట‌ల శాఖ‌లేని మంత్రిగా మిగిలిపోయారు. తాజాగా.. క‌లెక్ట‌ర్ నివేదిక‌ను అనుస‌రించి ఈట‌ల రాజేంద‌ర్ ను మంత్రివ‌ర్గం నుంచి తొల‌గిస్తూ సీఎం నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈట‌ల‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతోనే.. ఆయ‌నను మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించ‌డ‌మే లాంఛ‌న‌మేన‌ని తేలిపోయింది. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే సీఎం ఆయ‌న‌ను బ‌ర్త‌ర‌ఫ్ కూడా చేశారు. ఈ నేప‌థ్యంలో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ పై ఈట‌ల ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.