Begin typing your search above and press return to search.

భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించిన ఈట‌ల‌

By:  Tupaki Desk   |   26 May 2021 10:30 AM GMT
భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించిన ఈట‌ల‌
X
మాజీమంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు మూడునాలుగు సార్లు మీడియాతో స‌మావేశం అయ్యారు. అయితే.. త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన వారికి స‌మాధానాలు చెప్పేందుకు మాత్ర‌మే వాటిని వినియోగించుకున్నారు. కాగా.. ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ పై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో.. తాజాగా ప‌లు కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు.

మంగ‌ళ‌వారం హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్‌హౌస్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప‌లువురు బీజేపీ సీనియర్ నాయకులతో ఈట‌ల రాజేందర్ రహస్యంగా సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న్ను బీజేపీలోకి ఆహ్వానించిన‌ట్టుగా కూడా ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌య‌మై కిష‌న్ రెడ్డి స్పందిస్తూ.. తాను రాజేందర్‌తో ఫోన్‌లో మాత్రమే మాట్లాడానని, తనను ఎక్కడా కలవలేదని చెప్పారు. త్వరలో కలుస్తానని కూడా చెప్పారు.

దీంతో.. ఈట‌ల బీజేపీలోకి వెళ్ల‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ జోరందుకుంది. ఈ చ‌ర్చ‌పై ఈట‌ల స్పందించారు. ఈ మేర‌కు బుధ‌వారం ఓ ఛాన‌ల్ తో మాట్లాడారు మాజీ మంత్రి. తాను భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నానని వచ్చిన వార్తలను ఖండించారు. ఈ వార్త‌ల్లో ఏమాత్రం వాస్త‌వం లేద‌ని తేల్చి చెప్పారు.

అయితే.. తాను బీజేపీ నాయకులను క‌లిసిన విష‌యం మాత్రం వాస్త‌వ‌మేన‌ని అంగీకరించారు. కానీ.. అది పార్టీలో చేరేందుకు కాద‌ని స్ప‌ష్టం చేశారు. తన భవిష్యత్ ప్రయత్నాలకు మద్దతు కోరేందుకు మాత్రమే వారిని క‌లిసిన‌ట్టు చెప్పారు. ఇదే లక్ష్యంతో ఇత‌ర పార్టీల నాయకులను కూడా క‌లిసిన విష‌యాన్ని గుర్తు చేశారు ఈట‌ల‌.

ఇక‌, త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ గురించి మాట్లాడుతూ.. తాను స్వతంత్రంగా ఉంటానని చెప్పారు. మరే పార్టీలో చేరబోన‌ని, అలాంటి ఉద్దేశ‌మేదీ లేద‌ని ఈట‌ల రాజేంద‌ర్ తేల్చి చెప్పారు. అంతేకాకుండా.. త్వ‌ర‌లో తన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ విష‌య‌మై త్వరలోనే ఒక నిర్ణయంతో వస్తానని చెప్పారు. హుజురాబాద్ స్థానానికి జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నికలో తాను పోటీ చేస్తాన‌ని, ఈ మేర‌కు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు చెప్పారు ఈట‌ల‌.