Begin typing your search above and press return to search.

ఈట‌ల వ‌ల్లే కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య ర‌చ్చ మొద‌లైందా?

By:  Tupaki Desk   |   27 April 2022 2:30 AM GMT
ఈట‌ల వ‌ల్లే కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య ర‌చ్చ మొద‌లైందా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై మ‌ధ్య పొరాపొచ్చాలు ఉన్నాయ‌నే విష‌యం గుస‌గుస‌ల నుంచి మొద‌లై బ‌హిరంగ ర‌హస్యంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇటు గ‌వ‌ర్న‌ర్ అటు సీఎం కేసీఆర్ త‌మ త‌మ వాద‌న‌లు వినిపిస్తూ త‌మ‌వైపు ఎలాంటి ఉద్దేశ‌పూర్వ‌క చ‌ర్య లేద‌ని వ్యాఖ్యానిస్తున్న ప‌రిస్థితి.

తాజాగా ఈ వివాదంలోకి ఇటీవ‌లే ఎమ్మెల్యేగా సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసుకున్న సీనియ‌ర్ పొలిటిషీయ‌న్ ఈట‌ల రాజేంద‌ర్ చేరారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి త‌మ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ గవర్నర్, కేసీఆర్ గ్యాప్ కు ఈటల రాజేందరే కారణమని చ‌మ‌త్క‌రించారు.

ఈట‌ల త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి సంద‌ర్భంగా వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో అర్హ‌త లేని వ్య‌క్తిని ఎమ్మెల్సీ చేయాల‌ని కేసీఆర్ చూశార‌ని, గ‌వ‌ర్న‌ర్ అందుకు తిర‌స్క‌రించ‌గా...కేసీఆర్‌ ప్ర‌భుత్వం క‌క్ష క‌ట్టింద‌ని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ మెప్పుకోసం టీఆర్ఎస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఆయ‌న జోస్యం చెప్పారు.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. ముఖ్యమంత్రి పదవి చెప్పుతో సమానమన్న కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హతలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఆర్టీసీ చార్జీల పెంపుపై బీజేపీ ఉద్యమిస్తుందని ఈట‌ల ప్ర‌క‌టించారు.