Begin typing your search above and press return to search.

ఇలాంటివి కేసీఆర్ మాత్రమే చేయగలరేమో?

By:  Tupaki Desk   |   30 Dec 2019 8:53 AM GMT
ఇలాంటివి కేసీఆర్ మాత్రమే చేయగలరేమో?
X
ఉద్యమ కాలం నుంచి టీఆర్ ఎస్ బాస్ కు ఈటెల రాజేందర్ కున్న అనుబంధం అంతా ఇంతా కాదు. సంక్షోభ సమయంలోనే సారుకు అండగా నిలిచిన కొద్దిమంది నేతల్లో ఈటెల ఒకరు. తన భావోద్వేగ ప్రసంగాలతో అందరిని ఆకర్షించిన ఈటెల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పవర్ లోకి వచ్చిన టీఆర్ ఎస్ ప్రభుత్వంలో కీలకభూమిక పోషించారని చెప్పాలి. మధ్యలో ఏమైందో ఏమో కానీ.. ఈటెలను కేసీఆర్ కాస్త పక్కన పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ఈటెల నోటి నుంచి వచ్చిన మాటలు కూడా రాజకీయ కలకలానికి కారణంగా మారాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామం చూస్తే.. సీఎం కేసీఆర్ కు.. మంత్రి ఈటెల రాజేందర్ కు మధ్యనున్న గ్యాప్ తగ్గిందా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. దీనికి కారణం ముఖ్యమంత్రి కేసీఆరే. తాజాగా ఆయన చేసిన పనితో ఒక్కసారిగా ఈటెల గురించి మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

తాజాగా సీఎం కేసీఆర్ వేములవాడ ప్రోగ్రాం పెట్టుకోవటం తెలిసిందే. మిడ్ మానేరు ప్రాజెక్టును పరిశీలించటం.. అనంతరం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవటం.. మీడియాతో మాట్లాడటం లాంటి కార్యక్రమాల్ని పెట్టుకున్న కేసీఆర్ తన పరివారంతో పాటు.. అత్యాధునిక వసతులున్న పే..ద్ద బస్సుతో బయలుదేరారు.

వేములవాడకు వెళుతున్న కేసీఆర్ తన కాన్వాయ్ ను మార్గమధ్యంలో ఆపారు. ఎందుకంటే.. మంత్రి ఈటెల రాజేందర్ కోసం. తనతో పాటు ఈటెలను తీసుకెళ్లటాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వంలోని సీనియర్ మంత్రిని ముఖ్యమంత్రి వెంటబెట్టుకెళ్లటం ఒక ఎత్తు. కానీ.. అందుకు భిన్నంగా ఈటెలతో పాటు.. ఆయన సతీమణిని.. కుమార్తె నీత.. అల్లుడు అనూప్ లను కూడా తీసుకెళ్లారు. అదేంటి సీఎం ప్రోగ్రాంలో ఈటెల ఫ్యామిలీ ఎందుకన్న అనుమానం రావొచ్చు.

ఇదే విషయాన్ని ఆరా తీస్తే ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. వేములవాడకు వెళుతున్న సీఎం.. ఈటెల కుటుంబాన్ని తీసుకురావాలని.. కొత్తగా పెళ్లైన దంపతుల్ని కూడా తీసుకురమ్మని ప్రత్యేకంగా చెప్పటంతో వారిని కూడా బస్సు ఎక్కించారు. సీఎం కాన్వాయ్ రావటానికి ముందే కారులో రోడ్డు మీద వెయిట్ చేసిన వారు.. సీఎం కాన్వాయ్ లోని భారీ బస్సు ఆగిన వెంటనే అందులో ఎక్కేశారు. ఇలా.. అధికారిక కార్యక్రమంలో ఒక మంత్రి ఫ్యామిలీ మొత్తాన్ని తన వెంట తీసుకెళ్లటం లాంటివి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమయ్యే పనులుగా చెప్పక తప్పదు. కేసీఆరా.. మజాకానా?