Begin typing your search above and press return to search.

స్వరం పెంచిన ఈటల.. కేసీఆర్ పై నిప్పులు

By:  Tupaki Desk   |   9 Jun 2021 12:40 PM GMT
స్వరం పెంచిన ఈటల.. కేసీఆర్ పై నిప్పులు
X
సీఎం కేసీఆర్ పై ఈటల స్వరం పెంచారు. మరింతగా విమర్శలు కురిపించారు. దమ్ముంటే ప్రజాస్వామ్యబద్దంగా హుజూరాబాద్ లో పోటీచేసి చూపించాలని సవాళ్లు విసిరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ఈరోజు పర్యటించారు. ఎన్ని కుట్రలు చేసినా జనం కర్రుకాల్చి వాతపెడుతారని.. తమ నేతలపై వేధింపులకు పాల్పడితే ఖబడ్దార్ అంటూ వార్నింగ్ లు ఇచ్చారు. అధికార దుర్వినియోగంతో పోలీసులతో తన కార్యకర్తలను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని..గొర్ల మందమీద తోడేళ్లు పడుతున్నట్లు పడుతున్నారని.. మీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

ఎన్నికలు వస్తే గెలిచి తీరుతామన్న ఈటల.. జెండా, పార్టీని చూడటం లేదని..ఈటలను గెలిపించుకోవాలనుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో జిల్లా, మండల పరిషత్ లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పెన్షన్లు వెంటనే విడుదల చేయాలన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలను లాక్కునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

తాను పార్టీ పెట్టలేదని.. పార్టీని విడిచి పెట్టలేదని.. నన్ను బహిష్కరించారని.. ప్రాణం ఉండగానే బొంద పెట్టాలని చూస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. తానేమీ గాలికి గెలిచిన వాడిని కాదని.. ట్రెండ్ వస్తే ఎమ్మెల్యే అయిన వాడిని కాదని ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు.

ఇక నిరుద్యోగ భృతి ఏమైందని టీఆర్ఎస్ సర్కార్ ను ఈటల ప్రశ్నించారు. హుజూరాబాద్ ను జిల్లాగా ప్రకటించాలని.. వావిలాల, చల్లేరును మండలాలుగా చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ కామెంట్లపైనా స్పందించారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల మనసులో ఉండేలా పాలించాలన్నారు.