Begin typing your search above and press return to search.

ఆయ‌న‌తో క‌లిసి ఈటల కొత్త పార్టీ..?

By:  Tupaki Desk   |   7 May 2021 6:32 AM GMT
ఆయ‌న‌తో క‌లిసి ఈటల కొత్త పార్టీ..?
X
ఈట‌ల రాజేంద‌ర్ ను కేసీఆర్‌ మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన త‌ర్వాత.. మాజీ మంత్రికి సానుభూతి పెరుగుతోంది. ఈట‌లను తొల‌గిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన రోజు నుంచే చాలా మంది నేత‌లు ఆయ‌న్ను క‌ల‌సి వ‌చ్చారు. తాజాగా.. కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఈట‌ల‌తో భేటీ అయ్యారు. ఈట‌ల కొత్త పార్టీ పెడ‌తార‌ని ప్ర‌చారం సాగుతున్న నేప‌థ్యంలో.. కొండా క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మేడ్చ‌ల్ లోని ఈట‌ల నివాసంలో గురువారం వీరిద్ద‌రూ క‌లిశారు. చాలాసేపు మాట్లాడుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. వీరిద్ద‌రూ కొత్త పార్టీ గురించే మాట్లాడుకుని ఉంటార‌నే చ‌ర్చ‌లు సాగాయి. ఆత్మ‌గౌర‌వ నినాదంతో ఈట‌ల కొత్త పార్టీ పెట్టాల‌ని యోచిస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దానిగురించే కొండా క‌లిసి ఉంటార‌నే ప్ర‌చారం గుప్పుమంది.

అయితే.. వీళ్లిద్ద‌రికీ సామీప్యం కూడా ఉంది. తెలంగాణ ఉద్య‌మం నుంచీ క‌లిసి ప‌నిచేశారు. ఇద్ద‌రూ టీఆర్ఎస్ లో నిరాద‌ర‌ణ‌కు గురైన‌వారే. టీఆర్ఎస్ లో ఇమ‌డ‌లేకపోయిన కొండా.. గులాబీ గూటినుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. 2018లో చేవెళ్ల ఎంపీగా కూడా పోటీచేశారు. కానీ.. ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అప్ప‌టి నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇద్ద‌రూ క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

అయితే.. త‌మ భేటీపై క్లారిటీ ఇచ్చారు కొండా విశ్వేశ్వ‌ర రెడ్డి. ఈట‌ల భార్య త‌మ‌కు బంధువు అని తెలిపిన ఆయ‌న‌.. ఒక బంధువుగానే ఈట‌ల‌ను క‌లిసిన‌ట్టు చెప్పారు. మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం ప‌ట్ల సానుభూతి తెలిపిన‌ట్టు చెప్పారు. రాజ‌కీయ నేత‌గా ఈట‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌ని, రాజ‌కీయాలు ఏమీ మాట్లాడుకోలేద‌ని చెప్పారు. అయితే.. చివ‌ర‌లో కేసీఆర్ ను విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటేన‌ని చెప్పారు కొండా.