Begin typing your search above and press return to search.

హరీశ్ అడ్డాకు వెళ్లి మరీ ఆయనకు వార్నింగ్ ఇచ్చిన ఈటల

By:  Tupaki Desk   |   6 Nov 2021 4:54 AM GMT
హరీశ్ అడ్డాకు వెళ్లి మరీ ఆయనకు వార్నింగ్ ఇచ్చిన ఈటల
X
కాలం ఉత్తినే ఉండదు. మనం చేసిన కర్మలకు తగిన పలితాన్ని ఇస్తూ ఉంటుంది. మేనమామ ఇచ్చిన లక్ష్యాన్ని చేధించేందుకు వెనుకా ముందు చూసుకోకుండా.. తనకెంతో సన్నిహితుడైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో మంత్రి హరీశ్ వ్యవహరించిన కరకుదనం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కూరలో కరివేపాకు మాదిరి తీసిపారేసే మేనమామ కేసీఆర్ మనసు దోచుకోవటానికి ఈటల విషయంలో మరీ ఇంత కఠినంగా వ్యవహరించాలా? అని ఆయన సన్నిహితులు సైతం అంతర్గత సంభాషణల్లో మాట్లాడుకోవటం కనిపించింది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ.. తెలంగాణ అధికారపక్షానికి అన్నీ తానై అన్నట్లు వ్యవహరించిన హరీశ్.. ఈటల ఓటమి కోసం ఎంతలా శ్రమించారో అందరికి తెలిసిందే. గతంలోనూ ఇదే తీరును దుబ్బాకలో ప్రదర్శించి దెబ్బ తిన్న హరీశ్ కు హుజూరాబాద్ లోనూ షాక్ తప్పలేదు. ఈటల ఓటమి కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నింటిని చేసినా.. చివరకు ఈటల తన అధిక్యతను చేతల్లో చూపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం ఆయన హరీశ్ కు షాకిచ్చే పని చేశారు.

ఎవరెన్ని మాట్లాడినా.. హరీశ్ అడ్డా అయిన సిద్దిపేటకు వెళ్లి ఆయన్ను విమర్శించేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. దీనికి కారణం సదరు నియోజకవర్గంలో ఆయనకున్న పట్టే. అందుకు భిన్నంగా తాజాగా ఈటల మాత్రం సిద్దిపేటకు వెళ్లి మరీ మంత్రి హరీశ్ కు వార్నింగ్ ఇవ్వటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైనా మంత్రి హరీశ్ రావు బుద్ధి తెచ్చుకొని పిచ్చి పనులు చేయకుండా ఉండాలని తాను సిద్ధిపేట గడ్డ నుంచే హెచ్చరిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు ఈటల రాజేందర్.

కుట్రలు.. డబ్బు.. మద్యాన్ని నమ్మకున్న వారికి హుజూరాబాద్ లో ఎదురైన అనుభవమే రానున్న రోజుల్లోనూ తప్పదన్న ఆయన.. త్వరలోనే సిద్ధిపేటలో దళితగర్జన సభ పెడతామన్నారు. దానికి తానే నాయకత్వం వహిస్తానని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో విజయం అనంతరం సిద్దిపేటలోని రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లిన ఈటల.. పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

హరీశ్ రావును ఎమ్మెల్యేగా సిద్దిపేట ప్రజలు గెలిపిస్తే.. ట్రబుల్ షూటర్ పేరుతో రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా.. అక్కడకు వెళ్లి సిద్దిపేటను అభివృద్ధి చేసిన విధంగా మీ ప్రాంతాన్ని డెవలప్ చేస్తానని అక్కడి ప్రజల్ని మభ్య పెడుతుంటారని మండిపడ్డారు. అబద్ధాల మంత్రిగా ఆయన పేరు సంపాదించాని ఫైర్ అయ్యారు. మొత్తానికి తనను ఓడించేందుకు కంకణం కట్టుకుతిరిగిన హరీశ్ కు షాకిచ్చేలా చేసిన ఈటల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రానున్నరోజుల్లో హరీశ్ మీద ఈటల మరింతగా టార్గెట్ చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.