Begin typing your search above and press return to search.

కేసీఆర్ ట్రాప్‌లో ఈట‌ల‌.. ఇప్పుడు కావాల్సింది.. సానుభూతా? స‌మ‌ర‌మా?

By:  Tupaki Desk   |   21 Jun 2021 12:33 AM GMT
కేసీఆర్ ట్రాప్‌లో ఈట‌ల‌.. ఇప్పుడు కావాల్సింది.. సానుభూతా?  స‌మ‌ర‌మా?
X
రాజ‌కీయాల్లో వ్యూహాలు అనేకం ఉంటాయి. ముల్లును ముల్లుతోనే తీయాల‌న్న సామెత‌ను చాలా మంది ప్లే చేస్తుంటారు. అంటే.. త‌మ ప్ర‌త్య‌ర్థి నేత‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డం ద్వారా.. లేదా నేత‌ల‌పై కేసులు న‌మోదు చేయ‌డం ద్వారా.. తాము అనుకున్న‌ది సాధించ‌డం నేటి రాజ‌కీయాల్లో కామ‌న్‌గా జ‌రుగుతున్న ప‌రిణామాలు. అయితే.. ప్ర‌త్య‌ర్థులు లేదా.. కిట్ట‌నివారు వేసే ఇలాంటి ఉచ్చుల్లో చిక్కుకుంటే.. నేత‌ల‌కు మ‌రింత క‌ష్టంతోపాటు న‌ష్టాలు త‌ప్ప‌వు. ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. తెలంగాణ ఉద్య‌మ నాయ‌కుడు, నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీఆర్ ఎస్‌లో కీల‌క రోల్ పోషించిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లే.

ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా కూడా చేసిన ఈట‌ల‌.. త‌న‌దైన వ్యూహంతో ముందు కు సాగాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రీ ముఖ్యంగా కేసీఆర్ వంటి వ్యూహాత్మ‌క రాజ‌కీయాలు చేసే నేతపై పైచేయి సాధించేందుకు.. ఈట‌ల త‌న పంథాను అనుస‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, ఇప్పుడు చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలిస్తే.. మాత్రం.. ఆయ‌న కేసీఆర్ ట్రాప్‌లో చిక్కుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. స‌హ‌జంగానే కేసీఆర్‌ను కాద‌ని వెళ్లిన‌వారు.. లేదా.. ఆయ‌న‌పై తొడ‌గొట్టిన వారు ఇప్ప‌టి వ‌ర‌కు.. ఎవ‌రూ త‌మ స‌త్తా చాటుకోలేదు. దీనికి కార‌ణం.. ఆయా నేత‌ల విష‌యంలో కేసీఆర్ విసిరిన ట్రాప్‌లో వారు చిక్కుకోవ‌డ‌మే!

ఇప్పుడు ఈట‌ల విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయంగా కేసీఆర్‌.. ఈట‌ల‌ను రెచ్చ‌గొడుతున్నారు. ప్ర‌త్య‌క్షంగానో.. ప‌రోక్షంగానో.. ఈట‌ల‌పై త‌న పార్టీ నేత‌ల‌తో తీవ్ర విమ‌ర్శ‌లే చేయిస్తున్నారు. వీటికి ఈట‌ల స‌మాధానం చెప్ప‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టరు. కానీ, ఈ క్ర‌మంలో ఆయ‌న టంగ్ జారితే.. మొత్తానికే మోసం వ‌స్తుంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. కేసీఆర్‌పై ప్ర‌తీకారం తీర్చుకుంటాన‌ని.. బీజేపీ జేజ‌మ్మ‌ను కూడా కేసీఆర్ ఏమీ చేయ‌లేడ‌ని.. చేసిన వ్యాఖ్య‌ల‌పై ఒకింత వ్య‌తిరేక‌త వ‌స్తోంది.

కేసీఆర్‌ను గెల‌వాలంటే.. ఆయ‌న‌పై పైచేయి సాధించాలంటే.. ఈట‌ల‌కు ఇది స‌రైన మార్గం కాద‌ని.. త‌న స‌త్తాను నిరూపించుకునేందుకు ఆయ‌న క్షేత్ర‌స్థాయిలోకి దిగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప్ర‌స్తుత స‌మ‌యంలో ఈట‌ల‌కు స‌మ‌రం క‌న్నా.. ప్ర‌జ‌ల నుంచి సానుభూతి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. పార్టీల‌కు అతీతంగా ఈట‌ల సానుభూతి పెంచుకుంటే.. కేసీఆర్‌పై పైచేయి సాధించ‌డం తేలికేన‌ని చెబుతున్నారు. మ‌రి ఈట‌ల ఆదిశ‌గా వెళ్తారో.. లేక‌.. కేసీఆర్ ట్రాప్‌లోనే ఉంటారో చూడాలి.