Begin typing your search above and press return to search.

ఈటెల భూకబ్జా ప్రకంపనలు.. ఇప్పుడేం జరగనుంది?

By:  Tupaki Desk   |   1 May 2021 4:39 AM GMT
ఈటెల భూకబ్జా ప్రకంపనలు.. ఇప్పుడేం జరగనుంది?
X
క్లీన్ చిట్ ఉన్న నేతగా తెలంగాణ రాష్ట్ర మంంత్రి ఈటెల రాజేందర్ కు పేరుంది. బీసీల పక్షపాతిగా.. తెలంగాణ సాధనలో ఆయనకున్న కమిట్ మెంట్ ను ఎవరూ వేలెత్తి చూపలేరు. కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నారు కానీ.. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్ఎస్ కు అన్నితానై వ్యవహరించింది ఈటెల అన్నది మర్చిపోకూడదు. పార్టీకి ఎదురయ్యే ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ.. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించటం సామాన్యమైన విషయం కాదు. అందునా.. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకుల మధ్య ప్రత్యేక రాష్ట్ర అభిలాషను వ్యక్తం చేయటం.. వారు విసిరే సవాళ్లను తట్టుకొని నిలవటం అందరికి సాధ్యమయ్యేది కాదు.

అలాంటి ఈటెల మీద ఇప్పుడు భూకబ్జా ఆరోపణలు పడ్డాయి. వంద ఎకరాలకు పైనే భూమిని ఆయన స్వాధీనం చేసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు. అక్కడ షెడ్లు నిర్మిస్తున్నారన్న మాటతో పాటు.. ఈ రోజు (శనివారం) అధికార పార్టీకి చెందిన నమస్తే తెలంగాణలో ఫోటోలు కూడా అచ్చేశారు. వేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడేం జరగనుంది? అన్నది ప్రశ్నగా మారింది.

రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర అంశంగా మారి..ఇదే అంశంపై హాట్ చర్చ నడుస్తోంది. కొందరు రైతులు ఫిర్యాదు చేసినంతనే ముఖ్యమంత్రి కేసీఆర్ అంత వేగంగా నిర్ణయం తీసుకోవటం.. విచారణకు ఆదేశించటం లాంటివి చూస్తుంటే.. జరిగినవన్ని ఒక క్రమపద్ధతిలో సాగినట్లుగా చెప్పాలి. ఎందుకంటే.. కొందరు రైతులు వచ్చి ఆరోపణలు చేసినంతనే.. వాస్తవాలు ఏమిటో తెలుసుకోవటానికి కనీసం రోజు పడుతుంది. అప్పటివరకు మిగిలిన మీడియా సంగతి ఎలా ఉన్నా.. అధికారపార్టీ సొంత మీడియాలో భారీ ఎత్తున కథనాలు ప్రసారం చేయటం ఇంతకు ముందెప్పుడూ జరగలేదు.

అందుకు పెద్ద సారు పచ్చజెండా ఊపేశారంటే.. బలిపీఠం సిద్ధం చేసినట్లేనన్న వాదన వినిపిస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈటెల.. తీవ్ర భావోద్వేగంతో ఉన్నట్లు కనిపించింది. అయినప్పటికి ఎక్కడా సహనం కోల్పోకుండా.. శ్రుతి మించకుండా.. వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా తన ప్రెస్ మీట్ ను ముగించారని చెప్పాలి. కేసీఆర్ ఎంత వ్యూహాత్మకంగా ఉన్నారో.. తాను అంతే వ్యూహాత్మకంగా ఉన్నారన్నట్లు ఆయన తీరు కనిపించింది.

అంతేకాదు.. తాత్కాలికంగా న్యాయం ఓడిపోవచ్చన్న ఈటెల మాట చూసినప్పుడు.. తనపై ఆరోపణలు చేస్తున్న వారిది పైచేయి అయినా.. ఎల్లకాలం అదే ఉండదన్న విషయాన్ని ఈటెల స్పష్టం చేయటం కనిపిస్తుంది. అదే సమయంలో తనను బోనులో ఎక్కించిన అధినేతపై ఎలాంటి హాట్ కామెంట్లు చేయకుండా.. జరిగే పరిణామాలకు అనుగుణంగా స్పందించాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు చెప్పాలి.

మరిప్పుడేం జరుగుతుందన్నది అసలు ప్రశ్న. ఇటీవల కాలంలో ఈటెల పలు వేదికల మీద సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అయితే.. మాజీ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ మధ్యన ఆసక్తికర వ్యాఖ్య చేయటం తెలిసిందే. కొత్త పార్టీ అవసరం తెలంగాణలో ఉందన్న ఆయన.. తెర వెనుక పెద్ద కథనే నడిపిస్తున్నారని చెబుతున్నారు. కొండా.. ఈటెల లాంటి క్లీన్ చిట్ ఉన్నవాళ్లు..టీఆర్ఎస్ సర్కారులో పెద్దగా ప్రాధాన్యత లభించని రెడ్డి.. బీసీ వర్గాల్ని ఒక చోటకు తీసుకొచ్చేలా కొత్త పార్టీ పార్టీ ఏర్పాటు దిశగా రానున్న రోజుల్లో పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.

అయితే.. పలువురు అంచనా వేస్తున్నట్లుగా గులాబీ కారు రెండు ముక్కలు కావటం.. టీఆర్ఎస్ నిట్టనిలువునా చీలిపోయే పరిస్థితి ఉండకపోవచ్చంటున్నారు. ఈటెలకు మద్దతు ఇచ్చేవారంతా తెరవెనుకే ఉంటారని..జరుగుతున్న పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తూ.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం ద్వారా సీన్లోకి ఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు. ఇప్పటికైతే ఈటెల ఒంటరిగానే పోరు చేయాల్సి ఉంటుందని.. సరైన సమయంలోఈటెల తన సీన్ చూపించి.. సీఎం కేసీఆర్ కు షాకివ్వటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి.. ఇందులో నిజాలేమిటో కాలమే తేల్చాలి.