Begin typing your search above and press return to search.

మూడు రోజుల నుంచి ఈటెలకు తండ్రికొడుకులు సిగ్నల్ ఇచ్చేశారా?

By:  Tupaki Desk   |   1 May 2021 4:31 PM GMT
మూడు రోజుల నుంచి ఈటెలకు తండ్రికొడుకులు సిగ్నల్ ఇచ్చేశారా?
X
మంత్రి ఈటెల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు.. అనంతరం ఆయన వైద్యశాఖ నుంచి తప్పించటం లాంటి నిర్ణయాలతో పాటు.. ఆరోపణలపై నివేదికను తయారు చేయమని ఆదేశించటం.. వాయువేగంతో నివేదికను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉండటం లాంటివి చూస్తుంటే.. ఎప్పుడేం చేయాలన్న విషయాన్ని ముందుగా పేపర్ మీద రాసుకొని మరీ చేస్తున్నట్లుగా అనిపించట్లేదు. ఈ వాదనకు బలం చేకూరేలా ఈటెల చేసిన కీలక వ్యాఖ్యలు ఉన్నాయి. తాను ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ లకు మూడు రోజుల నుంచి పర్సనల్ ఫోన్ నెంబరుకు ఫోన్ చేస్తున్నా.. వారు స్పందించలేదన్నారు.

మూడు రోజుల నుంచి అపాయింట్ మెంట్ కు ప్రయత్నిస్తున్న విషయాన్ని చెప్పారు. ఈటెల మాటల్నే పరిగణలోకి తీసుకుంటే.. శుక్రవారానికి మూడు రోజుల ముందు అంటే బుధవారం నుంచి ఈటెలను పక్కన పెట్టినట్లుగా చెప్పాలి. ఈటెల భూకబ్జాపై లేఖ అందింది శుక్రవారమని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాంటప్పుడు.. మూడు రోజుల ముందు నుంచి అపాయింట్ మెంట్ అడుగుతున్నా ఎందుకు ఇవ్వనట్లు? తండ్రికొడుకులు ఇద్దరు కరోనాతో ఇబ్బంది పడుతున్నందున అపాయింట్ మెంట్ కు కుదరలేదని అనుకుందాం. అదే నిజమైతే.. పర్సనల్ నెంబరుకు ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ ఎత్తనట్లు? అన్నది అసలు ప్రశ్న.

ఈటెల వ్యాఖ్యాల్ని చూస్తే.. ఈటెలను తప్పించే విషయంలో ఆపరేషన్ కొద్ది రోజుల ముందు నుంచే మొదలైనట్లు చెబుతారు. సాధారణంగా.. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే.. ముందు మీడియా ముందుకు వస్తారు. స్థానిక నేతల్ని కలుస్తారు. ఈటెల ఎపిసోడ్ లో మాత్రం..ఆయన బాధితులు నేరుగా సీఎంను ఆశ్రయించటం చూస్తే.. కొన్ని సందేహాలు కలుగక మానదు. తాను ఫోన్ చేస్తే ఎత్తకపోవటం.. అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వకపోవటం లాంటి అంశాలు ఈటెల నోటి నుంచి వచ్చిన సందర్భంలో ఆయన మరిన్ని విషయాల్ని చెప్పుకొచ్చారు.

తనను పార్టీ నుంచి పొమ్మంటే సంతోషంగా వెళ్లిపోతానని.. లేదంటే వదిలిపెట్టమని చెబితే పార్టీ వదిలిపెట్టి వెళ్లిపోతానని.. కానీ ఇలాంటి ఆరోపణలు తనపై వేసి తనను అవమానించే రీతిలో వ్యవహరించటం మంచిపద్దతి కాదన్న ఆవేదనను వ్యక్తం చేవారు. తాను నికార్సైన వ్యక్తినని చెబుతున్న ఈటెల.. గులాబీ జెండా అందరిదీ అని.. అది ఏ ఒక్కరి సొత్తు కాదన్న మాట ఇప్పుడు కొత్త చర్చకు తావిస్తోంది. ఏమైనా.. జరుగుతున్న పరిణామాల్ని చూసినప్పుడు ఈటెల ఎపిసోడ్ లో సమ్ థింగ్.. సమ్ థింగ్ ఉందనిపించక మానదు.