Begin typing your search above and press return to search.

ఈటెల ఎపిసోడ్ లో సామాన్యుడి కంటే దారుణంగా ప్రవర్తించటమా సారూ?

By:  Tupaki Desk   |   5 May 2021 9:30 AM GMT
ఈటెల ఎపిసోడ్ లో సామాన్యుడి కంటే దారుణంగా ప్రవర్తించటమా సారూ?
X
సామాన్యుడికి కోపం వచ్చినా.. ఈగో కాస్త దెబ్బ తిన్నా.. వెంటనే జేబులో నుంచి సెల్ తీసి.. రెండు మూడు నెంబర్లను ఫోన్ చేయటం.. తనను కోపానికి గురి చేసిన వారి సంగతి చూస్తానని హెచ్చరించటం లాంటివి చేస్తుంటారు. తనకు అత్యంత సన్నిహితుడు.. దశాబ్దాల తరబడి తనతో కలిసి ప్రయాణించిన వ్యక్తి మీద కోపం వచ్చినంతనే.. సామాన్యుడి తరహాలో.. ఆ మాటకు వస్తే అంతకంటే తక్కువ ఆలోచన చేసే వారి మాదిరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

ఈటల మీద కోపం వచ్చినంతనే ఫోన్ తీసి చకచకా నాలుగు ఆదేశాలు జారీ చేయటం.. ఫటాఫట్ అంటూ నిర్ణయాలు వెలువరంచటం.. నివేదిక కోసం ఉరుకులు పరుగులు తీయించటంలాంటివి చూసినప్పుడు.. కోపంతో విచక్షణ కోల్పోయే సామాన్యుడికి ఏ మాత్రం తీసిపోని రీతిలో కేసీఆర్ చర్యలు ఉన్నాయని చెప్పాలి. ఒకరిని దెబ్బ తీయాలంటే పకడ్బందీగా వ్యవహరించే కేసీఆర్.. ఈటల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా బాలెన్సు మిస్ అయినట్లుగా కనిపిస్తోంది.

ప్రజాదరణ ఉన్న వ్యక్తి.. అందునా కబ్జాలు.. భూఆక్రమణలు.. స్కాంల మచ్చ లేని నేత మీద.. మచ్చ వేయటం కాస్త కష్టమైన పనే. తాను కేసీఆర్ కాబట్టి.. తానేం అనుకుంటే అది జరిగిపోతుందనుకోవటం ఆయనకు అలవాటే కాబట్టి.. ఆ అలవాటుతోనే ఈటల మీద విరుచుకుపడ్డారని చెప్పాలి. కాకుంటే.. గతానికి వర్తమానానికి మధ్య చాలానే తేడా ఉన్న విషయాన్ని సారు మిస్ అయినట్లుగా కనిపిస్తోంది.

గతంలో తనతో పడని నేతల్ని వెళ్లగొట్టే సమయానికి ఇప్పటి మాదిరి సోషల్ మీడియా.. వాట్సాప్ లేవు. యూ ట్యూబ్ వీడియోలు.. వాటిని చూసేందుకు అవసరమైన డేటా.. అందుకు సహకరించే ఫోన్లు లేని కాలం. ఇప్పుడు జమానా మారింది. పాత వ్యూహాన్ని అమలు చేయాలంటే సరికొత్తగా ట్రై చేయాలి. బాబును బుక్ చేసినట్లుగా.. రేవంత్ ను ఫిక్స్ చేసినట్లుగా చేయాలే కానీ.. మరీ ఇంత బలహీనంగా.. తెలంగాణలో చిన్న పోరగాడికి సైతం అర్థమయ్యేలా వేటు వేయటంలోనే కేసీఆర్ మొదటి తప్పు దొర్లింది.

కోపంలో వచ్చినప్పుడు సామాన్యుడు తన బలాన్ని తనకు మించి చెప్పుకోవటం చూస్తాం. కేసీఆర్ లాంటి వేలాది పుస్తకాలు చదివిన మేధావి ఇదే తీరును ప్రదర్శించటం దేనికి నిదర్శనం? చేతిలో పవర్ ఉంది కదా? అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే.. వ్యవస్థలు చేష్టలుడిగి ఉండిపోవు కదా? ఒకవేళ అలా ఉంటే.. తట్టిలేపే తెలివి ఈటల దగ్గర టన్నుల కొద్దీ ఉందన్నది మర్చిపోకూడదు. బలవంతుడైన నేతను బలహీనుడిగా మార్చి.. అనంతరం వేటు వేసే అలవాటున్న కేసీఆర్ .. ఈటెల విషయంలో తన విజయానికి కారణమైన ప్రాథమిక సూత్రాన్ని మిస్ అయ్యారు. ఈటలను బలహీనపర్చటం మానేసి.. భూకబ్జా వార్తతో ఆయన్ను మరింత బలోపేతం చేయటమే కాదు..అనునూయుల చేత అవాకులు చెవాకులు పేల్చి ఈటెల మీద మరింత సానుభూతి పెంచేలా చేయటం చూస్తే.. కేసీఆర్ సారు మరీ ఇంతలా తప్పులు చేయటమా? అన్న సందేహం కలుగక మానదు.