Begin typing your search above and press return to search.

వెనక్కు తగ్గిన ఈటల!

By:  Tupaki Desk   |   10 May 2021 4:30 AM GMT
వెనక్కు తగ్గిన ఈటల!
X
అవును మాజీమంత్రి ఈటల రాజేందర్ వెనక్కుతగ్గారు. కరోనా వైరస్ సమస్య తీవ్రత తగ్గిన తర్వాతే తన రాజీనామా గురించి ఆలోచిస్తానని తాజాగా ప్రకటించారు. నిజానికి కరోనా వైరస్ తీవ్రతకు రాజేందర్ రాజీనామాకు ఎలాంటి లింక్ లేదు. అయినా రాజీనామా చేయటానికి కరోనా వైరస్ ఉదృతిని ఈటల అడ్డంపెట్టుకున్నారు. దీంతో రాజీనామా చేయటం ఎంఎల్ఏకు ఇష్టంలేదనే చర్చ మొదలైపోయింది.

మంత్రివర్గం నుండి అవమానకరంగా ఈటలను కేసీయార్ బయటకు గెంటేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటినుండి వరుసగా తన మద్దతుదారులతో భేటీలు నిర్వహించటంతో రాజేందర్ ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసేయబోతున్నట్లు మద్దతుదారులు ప్రకటించారు. ఎంఎల్ఏ రాజీనామాతో తొందరలోనే హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు వస్తాయనే అందరు అనుకున్నారు.

నియోజకవర్గంలో మద్దతుదారులు, సన్నిహితులతో వరుసబెట్టి సమావేశాలు నిర్వహించిన ఈటల చివరకు ఆదివారం మాట్లాడుతు కరోనా వైరస్ సమస్య తర్వాతే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. కరోనా వైరస్ కు ఈటల రాజీనామాకు సంబంధం ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు. కరోనా వైరస్ తీవ్రత నేపధ్యంలో ఉపఎన్నిక రావద్దని ఒకవేళ ఎంఎల్ఏ అనుకున్నారేమో.

అయితే ఈటల ఇప్పటికిప్పుడు రాజీనామా చేసినా క్షేత్రస్ధాయిలోని పరిస్ధితుల కారణంగా అర్జంటుగా కేంద్ర ఎన్నికల కమీషన్ ఉపఎన్నిక పెట్టే అవకాశంలేదు. కరోనా వైరస్ సమస్య తగ్గిన తర్వాత మాత్రమే ఉపఎన్నిక జరుపుతుంది. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీకి జరపాల్సిన ఉపఎన్నిక విషయంలో కూడా ఎన్నికల కమీషన్ ఇదే నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈటల రాజీనామా చేసినా వెంటనే ఉపఎన్నిక జరిగే అవకాశం లేదు.

ఇదే విషయం ఈటల రాజీనామా విషయాన్ని ప్రభావితం చేసినట్లు చెబుతున్నారు. తానిపుడు రాజీనామా చేస్తే వెంటనే ఆమోదించేస్తారు. కాబట్టి ఈటల మాజీ ఎంఎల్ఏ అయిపోతారు. ఉపఎన్నిక వెంటనే జరిగే అవకాశం ఉంటే రాజీనామా వేడి చల్లారకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఇపుడు రాజీనామా చేసినా ఎప్పుడు జరుగుతుందో తెలీని ఉపఎన్నిక వరకు రాజీనామా హీట్ ను మైన్ టేన్ చేయటం కష్టం. అలా జరిగితే తనకు తీరని నష్టమని రాజేందర్ భావించినట్లుంది. అందుకనే రాజీనామాకు, కరోనా వైరస్ కు లింక్ పెట్టారు.