Begin typing your search above and press return to search.

మళ్లీ మొదటికొచ్చిన ఈటల ‘పంచాయతీ’

By:  Tupaki Desk   |   16 Nov 2021 8:51 AM GMT
మళ్లీ మొదటికొచ్చిన ఈటల ‘పంచాయతీ’
X
హుజురాబాద్ విజయం తర్వాత ఈటల రాజేందర్ కు సంబంధించిన భూముల వ్యహారం ముగిసిందని అందరూ అనుకున్నారు. అయితే ఆ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఈటల కుటుంబానికి చెందిన భూముల్లో  తిరిగి సర్వే చేయనున్నారు. మెదక్ జిల్లాలోని భూముల సర్వేకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే రాజేందర్‌ కు చెందిన జమున హేచరీస్‌ భూములను సర్వే చేసేందుకు అధికారులు నోటీసులిచ్చారు. భూముల సర్వేకు రావాలంటూ ఈటల కుటుంబసభ్యులతో పాటు 154 మందికి నోటీసులు జారీ చేశారు.

మెదక్ జిల్లా ముసాయిపేట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన వ్యక్తులు తమ భూములను ఈటల ఆక్రమించారని నేరుగా సీఎం కేసీఆర్ ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే కేసీఆర్ ఆదేశాలతో రెవెన్యూ, అటవీ, అవినీతీ నిరోధక, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. అచ్చంపేట 77, 78, 80, 81, 82, 130 సర్వే నంబర్లలో సర్వే చేశారు. 20 మంది రైతుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సర్వేలో 66.01 ఎకరాలు అసైన్డ్, సీలింగ్ భూములను జమునా హేచరీస్ ప్రతినిధులు ఆక్రమించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. హకీంపేట, అచ్చంపేట గ్రామాల పరిధిలోని ఉన్న ఈటల హేచరీలతో పాటు పక్కనే ఉన్న భూముల్లో కూడా సర్వే చేశారు. సర్వే చేసిన అధికారులు సీలింగ్ భూములు, అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

అయితే  సర్వే నోటీసులపై ఈటల సతీమణి జమున  హైకోర్టును ఆశ్రయించారు. భూములు ఎవరివో తేల్చేందుకు నోటీసు ఇస్తే తప్పేంటని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక, కొవిడ్ ఆంక్షల పేరుతో ఈటల భూములపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హుజురాబాద్ ఎన్నిక తర్వాత అంటే నవంబర్ 8న జమున హేచరీస్‌ భూములను సర్వే చేసేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో భూ సర్వే చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.

మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలోని జమున హేచరీస్ లో సీలింగ్‌, అసైన్డ్‌ భూములున్నాయనే ఆరోపణ నేపథ్యంలో గతంలో భూ సర్వే కోసం నోటీసులు జారీ చేశామని మెదక్ కలెక్టర్  హరీశ్‌ తెలిపారు. కానీ హేచరీస్‌ యాజమాన్యం సర్వే ఆపాలని హైకోర్టులో పిటిషన్‌ వేసిందని తెలిపారు. ఇందుకు కోర్టు అంగీకరించలేదని, కొవిడ్‌ వ్యాప్తి కారణంగా సర్వేను 3 నెలల పాటు వాయిదా వేయాలని ఆదేశించిందని ఆయన గుర్తుచేశారు. హకీంపేట, అచ్చంపేటలో ఉన్న జమున హేచరీస్‌ డైరెక్టర్‌, ఈటల  కోడలు క్షమితకు అధికారులు నోటీసులు అందజేశారు.

ఈ సర్వేలో భాగంగా ఈ నెల 16వ తేదీన అచ్చంపేట గ్రామ పరిధిలోని 130 సర్వే నెంబర్ లో సర్వే చేస్తారు. రేపు 17వ తేది ఇదే గ్రామంలోని 77 నుంచి 82 సర్వే నెంబర్ లో ఉన్న భూములను సర్వే చేస్తారు. 18వ తేది హకీంపేట గ్రామం పరిధిలోని 97 సర్వే నెంబర్లోని భూములను సర్వే చేస్తామని అధికారులు చెబుతున్నారు.  తూప్రాన్ డివిజన్ ఉప సర్వేయర్ ఆధ్వర్యంలో ఈ సర్వే చేస్తారు.