Begin typing your search above and press return to search.

డీజీపీకి ఫోన్ చేసిన ఈటల..విషయం తెలిస్తే అవాక్కే..!

By:  Tupaki Desk   |   5 Sep 2019 12:01 PM GMT
డీజీపీకి ఫోన్ చేసిన ఈటల..విషయం తెలిస్తే అవాక్కే..!
X
కొందరు మాత్రమే కొన్ని పనులు చేస్తారు. అవే పనులు మరికొందరు చేస్తే రోటీన్ కు భిన్నంగా ఉండటమే కాదు.. కాస్త సిత్రమైన పరిస్థితులు.. పరిణామాలు చోటు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. తాజాగా అలాంటి సీనే తెలంగాణలో చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి ఈటల సాబ్ కు మధ్య అదేదో జరుగుతుందన్న వార్తలు మీడియాలో జోరుగా రావటమే కాదు.. ఉద్యమ నాయకుడ్ని ఉద్యమ అధినేత ఏదేదో చేస్తారన్న ప్రచారం అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు వాట్సాప్ గ్రూపుల్లోనూ జోరుగా సాగుతుంది.

కేసీఆర్ వర్సెస్ ఈటల మధ్య నడుస్తున్నది రచ్చేనంటూ వాదించే వారు తమ వాదన సరైనదని నిరూపించేందుకు.. ఈ మధ్యన జరిగిన సీఎం సమీక్షా సమావేశానికి మంత్రి ఈటల హాజరు కావటాన్ని ప్రత్యేకంగా ఎత్తి చూపిస్తున్నారు. అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి పక్కన పెడితే.. తాజాగా చోటు చేసుకున్న మరో అంశం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.

రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ మహేందర్ రెడ్డికి మంత్రి ఈటల రాజేందర్ ఫోన్ చేశారన్న వార్త ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఈటల సాబ్ ఎందుకు ఫోన్ చేశారో తెలుసా? రాష్ట్రంలో వణుకుతున్న విషజ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని.. పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన వాహనాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు పెరిగే అవకాశం ఉందని చెప్పారట.

అంతేనా.. సీజ్ చేసిన వాహనాల్లో వాననీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. పోలీస్ స్టేషన్ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూడా స్పష్టం చేశారట. ఇలాంటి విషయాల్ని వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఒక ప్రెస్ నోట్ విడుదల చేయొచ్చు కదా? అయినా.. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు.. సీజ్ చేసిన వాహనాల్లో మాత్రమే దోమలకు స్థావరాలుగా ఉంటాయా? ఆ మాటకు వస్తే.. మరెన్నో ప్రాంతాలు దోమలకు ఆవాసాలుగా ఉంటాయి. కానీ.. వాటిని వదిలేసి.. కేవలం పోలీస్ స్టేషన్ల గురించి మంత్రి ఈటల సాబ్ ఫోన్ చేసుడేంది? అన్నది ఒక ప్రశ్న.

గడిచిన ఐదేళ్లలో దోమల కారణంగా విష జ్వరాలు విరుచుకుపడిన సందర్భాలెన్నో ఉన్నాయి. అప్పుడే వైద్య ఆరోగ్య శాఖామంత్రి చేయని రీతిలో పోలీస్ బిగ్ బాస్ కు ఫోన్ చేయలేదే? ఇప్పుడు ఈటల సాబ్ ఎందుకు ఫోన్ చేసినట్లు? తెలంగాణలో దోమలు తెగ పెరిగిపోయిన నేపథ్యంలో.. వాటి మీద నిఘా పోలీసులైతే బాగా పెడతారన్న ఉద్దేశంతో కూడా ఫోన్ చేసి ఉంటారేమో? మొత్తానికి రాష్ట్ర డీజీపీకి నేరుగా ఫోన్ చేసిన మంత్రి ఈటల వ్యవహారం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసిందన్న మాట మాత్రం బలంగా వినిపిస్తోంది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఇలా ఫోన్లు చేసుడు పెద్ద సారుకు సుర్రుమంటుందేమో చూసుకో ఈటెల అనేటోళ్లు మస్తుమంది కనిపిస్తున్నారు. ఆ మాత్రం అవగాహన లేకుండా ఈటల ఫోన్ చేస్తారా ఏంది?