Begin typing your search above and press return to search.

ఈటెల కోరితే ప‌ట్టించుకోలేద‌ట‌

By:  Tupaki Desk   |   4 Jun 2017 6:15 AM GMT
ఈటెల కోరితే ప‌ట్టించుకోలేద‌ట‌
X
దేశ వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని భావిస్తున్న జీఎస్టీ ప‌న్ను విధానానికి సంబంధించిన కీల‌క చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే నెల మొద‌టి తారీఖు నుంచి అమ‌ల్లోకి రానున్న ఈ ప‌న్ను విధానం దేశ ఆర్థిక‌వ్య‌వ‌స్థ మీద పెను ప్ర‌భావాన్ని చూపుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. జీఎస్టీ అమ‌లు నేప‌థ్యంలో.. వివిధ ర‌కాల వ‌స్తువులు.. వ‌స్తు సేవ‌లకు విధించే ప‌న్ను విష‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో ఏ వ‌స్తువుపై ఎంత ప‌న్ను వేయాల‌న్న అంశంపై జ‌రుగుతున్న చ‌ర్చ విష‌యంలో కొన్ని రాష్ట్రాలు చేసే వాద‌న‌ల్ని.. విన‌తుల్ని కేంద్రం ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది. బంగారంపై ప‌న్ను విధించే విష‌యంలో రాష్ట్రాల మ‌ధ్య న‌డిచిన వాద‌న అంతా ఇంతా కాదు. అయితే.. ఈ విష‌యంలో కేంద్రం ఇప్పుడున్న ప‌న్నుకు ఒక శాతాన్ని అద‌నంగా వ‌డ్డిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

ఇక‌..సామాన్యుల మీద ప్ర‌భావం చూపించే అంశాల మీదా కేంద్రం తాను అనుకున్న‌ట్లే నిర్ణ‌యం తీసుకున్న‌ది త‌ప్పించి.. రాష్ట్రాల వాద‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌న్న మాట వినిపిస్తోంది. తాజాగా ఇదే ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద‌ర్‌. ల‌క్ష‌లాది మంది జీవ‌నాధారమైన బీడీ ప‌రిశ్ర‌మ‌ను దెబ్బ తీసేలా నిర్ణ‌యం తీసుకోకుండా.. బీజీ ఆకుల మీద‌.. బీడీల మీదా ప‌న్నులు విధించొద్ద‌ని కోరినా కేంద్రం ప‌ట్టించుకోలేదున్నారు.

త‌మ విన‌తిని పట్టించుకోకుండా బీడీ ఆకుల మీద 18 శాతం.. బీడీల‌పైన 28 శాతం ప‌న్ను విధించ‌టంపైన ఈటెల తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. బీడీ ఆకుల మీద ప‌న్ను తగ్గించాల్సిన అవ‌స‌రాన్ని చెబుతూ.. రాష్ట్రంలో బీడీ కార్మికుల‌కు నెల‌స‌రి వెయ్యి రూపాయిల భృతి ఇస్తున్న విష‌యాన్ని చెప్పినా.. విన‌లేద‌ని వాపోయారు. వ్య‌వ‌సాయ ఉత్పత్తులకు సంబంధించి ప‌న్ను లేకుండా ఉండాల‌ని కోరినా ఇన్ పుట్ స‌బ్సిడీ ఉంటుందంటూ 5 శాతం ప‌న్ను విధించార‌న్నారు. జీఎస్టీ స‌మావేశంలో 99 శాతం అంశాలు కొలిక్కి వ‌చ్చాయ‌న్న ఈటెల.. కొన్ని అంశాల మీద కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/