Begin typing your search above and press return to search.

ఆట మొద‌లైందంటూ కేసీఆర్‌ను ఆడుకున్న ఈట‌ల‌

By:  Tupaki Desk   |   7 Nov 2021 3:42 AM GMT
ఆట మొద‌లైందంటూ కేసీఆర్‌ను ఆడుకున్న ఈట‌ల‌
X
ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్ ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో ఓ ఐకాన్‌గా మారిపోయాడు. ఇప్పుడు అధికార టీఆర్ఎస్‌తో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీల్లో కూడా ఈట‌లే హాట్ టాపిక్ అయ్యారు. కొద్ది రోజుల వ‌ర‌కు ఈట‌ల చుట్టూనే తెలంగాణ రాజ‌కీయ చ‌ర్చ‌లు న‌డ‌వ‌నున్నాయి. ఇక ఉప ఎన్నిక వేళ ఈట‌ల‌ను క‌ట్టడి చేసేందుకు అధికార పార్టీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డింది. అధికార బ‌లంతో పాటు పోలీసులు వాడుకుని నానా ఇబ్బంది పెట్టేందుకు ప్ర‌య‌త్నించింద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించిన ఈట‌ల ఈ రోజు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ‌లో అస‌లు ఆట ఇప్పుడు మొద‌లైంది అన్న ఈట‌ల తెలంగాణ‌లో క‌ల్వ‌కుంట్ల రాజ్యాంగం అమ‌లవుతోంద‌ని విమ‌ర్శించారు. వ‌చ్చే 2023 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ను తెలంగాణ ప్ర‌జ‌లు పాత‌ర వేయ‌బోతున్నార‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. న‌రకం అంటే ఏంటో గ‌త ఐదు నెల‌లుగా తెలంగాణ ప్ర‌జ‌లు చూశార‌ని ఈట‌ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం కుర్చీని త‌న ఎడ‌మ కాలి చెప్పుతో పోల్చిన కేసీఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించార‌ని ఈట‌ల మండిప‌డ్డారు.

కేసీఆర్ ప్ర‌జ‌ల కోసం ఎప్పుడూ ప‌థ‌కాలు తీసుకురార‌ని.. ఆయ‌న కేవ‌లం ఎన్నిక‌ల కోస‌మే ప‌థ‌కాలు క్రియేట్ చేస్తార‌ని విమ‌ర్శించారు. తెలంగాణ సీఎంవోలో దళిత‌, బీసీ, మైనార్టీ అధికారులు ఎందుకు లేరో కేసీఆర్ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కేసీఆర్ అరిష్ట పాల‌న అంతం చేయ‌సేందుకు తెలంగాణ ప్ర‌జ‌లు కాచుకుని ఉన్నార‌ని.. దళితబంధు యావత్తు తెలంగాణ దళిత సమాజానికి ఇవ్వాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇక త‌న గెలుపును ఆయ‌న హుజూరాబాద్ ప్ర‌జ‌ల‌కు అంకిత‌మిచ్చారు.

ఇక హుజూరాబాద్‌లో పోలీసుల క‌నుస‌న్న‌ల్లోనే టీఆర్ఎస్ డ‌బ్బులు పంచింద‌ని.. దీనిపై ఆధారాల‌తో స‌హా ఎన్నిక‌ల సంఘానికి తాను ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పారు. తెలంగాణ‌లో బానిస‌త్వం చెల్ల‌ద‌న్న విష‌యాన్ని హుజూరాబాద్ ప్ర‌జ‌లు నిరూపించార‌ని ఈట‌ల చెప్పారు. తెలంగాణ ఆక‌లిని అయినా భ‌రిస్తుంది కాని.. ఆత్మ‌గౌర‌వాన్ని అమ్ముకోద‌న్నారు. ఇక తెలంగాణ‌లో ఉన్న కవులు, కళాకారులు, విద్యార్థులు లేకుంటే కేసీఆర్ ఉన్నాడా ? అని ఈట‌ల ప్ర‌శ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతాడ‌ని ఈట‌ల దుయ్య‌బ‌ట్టారు.