Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ కుంభస్థలాన్నే కొట్టబోతున్న ఈటల.. సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   9 July 2022 12:30 PM GMT
టీఆర్ఎస్ కుంభస్థలాన్నే కొట్టబోతున్న ఈటల.. సంచలన ప్రకటన
X
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. అప్పుడే కదా హీరోగా నిలిచేది. తనను మంత్రిపదవి నుంచి తొలగించి అష్టకష్టాలు పెట్టి.. భూములు లాగేసుకొని రాజకీయంగా అణగదొక్కిన కేసీఆర్ ను టార్గెట్ చేశారు ఈటల రాజేందర్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీచేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. ఇందుకోసం ఇప్పటి నుంచే గజ్వేల్ లో సీరియస్ గా వర్క్ చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈటల స్పష్టం చేశారు. బెంగాల్ లో బీజేపీ నేత సువేందు అధికారి ఎలాగైతే బెంగాల్ సీఎం మమతను ఓడించాడో.. తాను కేసీఆర్ ను ఓడిస్తానని శపథం చేశాడు.

తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ ఇప్పటికే రకరకాలు వ్యూహాలు రచిస్తోంది.  హైదరాబాద్ లో  ఇటీవల నిర్వహించిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సక్సెస్ కావడంతో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇక పార్టీని పటిష్ట పరిచేందుకు చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించింది.  రాష్ట్రంలో ‘ముందస్తు’ ఊహాగానాలు ఎక్కువగా వస్తుండడంతో కొంత మంది నాయకులు పార్టీలు మారేందుకు రెడీగా ఉన్నారు.

ముఖ్యంగా టీఆర్ఎస్ లో అసంతృప్త నేతలు ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నాయకులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు.  అలాంటి వారికి ఆఫర్లు ప్రకటించి పార్టీలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ బాధ్యతలను ఈటల రాజేందర్ కు అప్పగించారు. బీజేపీలో చేరిక కమిటీ కన్వీనర్ గా ఈటలను నియమించారు. ఇంతకాలం రాజేందర్ కు ప్రాధాన్యం లేదని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు ఈ బాధ్యతను అప్పగించడంతో పార్టీ కోసం ఇక సీరియస్ గా పనిచేయనున్నారు.

 కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన చేరిక వెనక ఈటల రాజేందర్ ఉన్నట్ల సమాచారం. అలాగే టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అసంతృప్త నేతలెవరో ఈటలకు తెలుసు. వారిని రప్పించేందుకు కూడా ఆయన వ్యూహం రచించే అవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త నేతలు అదును చూసి ఇతర పార్టీల్లోకి వెళ్లనున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్తితుల్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో చెప్పలేమని భావిస్తున్నారు. బీజేపీ పుంజుకుంటున్నా.. రాను రాను ఏ విధంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉందని వాపోతున్నారట.

చేరికల కమిటీకి ఈటలను ఇన్ చార్జిని చేయడంతో మరింత దూకుడుగా ఆయన ముందుకెళుతున్నారు. ఏకంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నే ఓడించేందుకు స్కెచ్ గీస్తున్నాడు. తనను రాజకీయంగా దెబ్బకొట్టిన కేసీఆర్ ను.. అంతే స్థాయిలో దెబ్బతీసేందుకు గజ్వేల్ లో పాగా వేసినట్లు సమాచారం.మరి ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా? అన్నది వేచిచూడాలి.