Begin typing your search above and press return to search.

ఈటెల ఎఫెక్ట్: టీఆర్ ఎస్‌ లో ఏం జరుగుతోంది..!

By:  Tupaki Desk   |   31 Aug 2019 1:53 PM GMT
ఈటెల ఎఫెక్ట్: టీఆర్ ఎస్‌ లో ఏం జరుగుతోంది..!
X
టీఆర్ ఎస్ పార్టీలో రాజకీయాలు వేడెక్కాయి. సీనియర్ నేత - మంత్రి ఈటెల రాజేందర్ పేల్చిన మాటల తూటాల జ్వాలలు ఇంకా రేగుతూనే ఉన్నాయి. ఈటెల మేమే గులాబీ జెండాకు ఓనర్లమంటూ చేసిన వ్యాఖ్యలు టీఆర్ ఎస్ అధిష్టానాన్ని షాక్ గురిచేశాయి. ఒకవైపు టీఆర్ ఎస్ అధిష్టానం ఈటెల మాటలపై ఆలోచనలో ఉండగానే - మరోవైపు ఈటెలకు ప్రజాసంఘాలు - కుల సంఘాలు - అభిమానులు జై కొడుతున్నారు. ఫైర్ తో మాట్లాడటం వల్ల అందరూ ఆయన ఇంటి వైపు వెళుతున్నారు.

ఆయన ఎప్పుడైతే మాటల మంటలు రేపారో అప్పటి నుంచి ఆయన ఇంటికి అభిమానులు - కార్యకర్తలు - నేతలు - ఉద్యోగ - మహిళా - కుల సంఘాల నేతలు - ప్రజా ప్రతినిధుల తాకిడి ప్రారంభమైంది. దీంతో మేడ్చల్‌ మండలం పూడూరులోని ఔటర్‌ రింగు రోడ్డు పక్కన ఉన్న ఈటెల నివాసం సందడిగా మారింది. అయితే వచ్చిన వారందరితోనూ ఆయన ఓపికగా మాట్లాడుతున్నారు.

అలాగే మానకొండూరు టీఆర్ ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కూడా ఈటలను కలిసి చాలాసేపు మాట్లాడారు. అటు ‘ఈటల నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ప్రకటనలూ చేయనని - ఓపికగా ఉండాలని ఈటెల.. కార్యకర్తలకు సూచించారు. అలాగే ఇంటి లోపలకి కెమెరాలు - ఫోన్లని అనుమతించలేదు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం ఈటెలని మందకృష్ణ మాదిగ, ఆర్‌.కృష్ణయ్య సైతం కలిసినట్లు సమాచారం.

ఈటెల వైపు పరిస్థితి అలా ఉంటే టీఆర్ ఎస్ అధిష్టానం తరుపు నుంచి మంత్రి ఎర్రబెల్లి ఈటెల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే బాస్ అని ఎర్రబెల్లి అన్నారు. ఇక గులాబీ జెండాను కేసీఆర్ ఒక్కరే తయారు చేశారని - ఈటెల రాజేందర్ అంశం సమసిపోయిందని - ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదని అన్నారు. అలాగే తాను కూడా టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసి లెటర్ ఇప్పించానని ఎర్రబెల్లి గుర్తు చేశారు.

అయితే జరుగుతున్న ఈ పరిణామాలని చూస్తుంటే ఈటెల ఏదో సంచలన నిర్ణయం తీసుకుంటారని అర్ధమవుతుంది. అటు ఎర్రబెల్లి ఈటెల మంత్రి పదవికి ఎలాంటి ఢోకా లేదని చెప్పినా.. ఆయనని మంత్రి పదవి నుంచి తప్పించడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి రానున్న రోజుల్లో గులాబీ పార్టీలో ఎలాంటి సంచలన సంఘటనలు చోటు చేసుకుంటాయో.