Begin typing your search above and press return to search.

ఆంధ్రులు బాబును ఏం కోరాలో చెప్తున్న ఈటెల

By:  Tupaki Desk   |   3 March 2017 3:21 PM GMT
ఆంధ్రులు బాబును ఏం కోరాలో చెప్తున్న ఈటెల
X
ఏపీ అసెంబ్లీ ప్రారంభోత్సం సంద‌ర్భంగా చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేని అంధుడు చంద్రబాబు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బాబుకు దమ్ము - సత్తా ఉంటే అభివృద్ధిలో పోటీపడాలే త‌ప్ప చ‌వ‌క‌బారు ఆరోప‌ణ‌లు చేయ‌వ‌ద్ద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రజలూ త‌మ‌కూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాంటి నాయ‌కుడు ఉంటే బాగుండున‌ని కోరుకుంటున్నారని మంత్రి ఈటల రాజేంద‌ర్ తెలిపారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన చిన్నరాష్ట్రాలే అభివృద్ధిలో ముందున్నాయని తెలిపారు. గుజరాత్ - చత్తీస్ ఘడ్ - హర్యాణ - ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని వివ‌రించారు. ఈ సత్యాన్ని చూడలేని అంధుడు చంద్రబాబు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాస్తవాలను గ్రహించకుండా, తెలంగాణ ఏర్పాటు చీకటిరోజు అని మాట్లాడడం అత్యంత బాధాకరమ‌న్నారు.

చంద్రబాబు మాటతీరు అవగాహన లేనిది, అత్యంత హీనమైనద‌ని ఈటెల రాజేంద‌ర్ ధ్వ‌జ‌మెత్తారు."పార్లమెంటులో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించాయి. మీ వెకిలి చేష్టలకు ప్రలోభాలకు లొంగలేదు. పద్నాలుగు సంవత్సరాల పాటు అన్ని పార్టీలను కలిసిన కేసీఆర్ తొక్కని గడపలేదు, ఎక్కని మెట్టు లేదు. ఆర్ ఎస్ యూ నుంచి ఆరెస్సెస్ వరకూ అందరినీ ఒప్పించి రాష్ట్రం సాధించాం"అని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు చంద్రబాబు మాట తీరును, కార్చిన మొసలి కన్నీరును చూసి అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బాబు మాట్లాడడం అభ్యంతరకరమ‌న్నారు. రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ముల్లా కలిసుందాం, అభివృద్ధిలో ముందుందాం అని కేసీఆర్ ఆనాడు చెప్పారు. ఈనాడు సుసాధ్యం చెేశారని అన్నారు. కేసీఆర్ తో పోటీ పడలేక, పరిపాలన రాక, సత్తా లేక, దమ్ము లేక ఏపీ ప్రజల మన్ననలు పొందలేక చంద్రబాబు మాట్లాడుతున్నారని తీవ్రంగా మండిప‌డ్డారు. తాము మాత్రం సుస్థిర, మానవీయ, ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజల విశ్వాసం పొందిన‌ట్లు వివ‌రించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆ విశ్వాసం పొందలేక మొసలికన్నీరు కారుస్తూ చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

విడిపోయిన రెండు సంవత్సరాల్లోనే రెండు లక్షల అరవై వేల కోట్ల బడ్జెట్ ను రెండు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టుకున్నామంటే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నామనే అర్థమ‌ని ఈటల చెప్పారు. ఈ వాస్తవాన్ని మరచిపోయి మాట్లాడడం దురదృష్టకరమ‌న్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా త‌మ‌కూ ఓ కేసీఆర్ ఉంటే బాగుండు అని భావిస్తున్నారని ఈటెల రాజేంద‌ర్ తెలిపారు. ఇప్పటికైనా పోటీ పడాల్సింది అభివృద్ధిలో కాని, కుట్రలు, కుతంత్రాల్లో కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజ‌లు చంద్రబాబు మాటల్ని గమనించి...చౌకబారు మాటలు బంద్ పెట్టి అభివృద్ధిలో ముందుకు నడవమని అడగాల‌ని ఈటెల సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/