Begin typing your search above and press return to search.

దళితులందరికీ ఇచ్చేంత డబ్బు సర్కార్ దగ్గర లేదు: ఈటల

By:  Tupaki Desk   |   19 Aug 2021 10:30 AM GMT
దళితులందరికీ ఇచ్చేంత డబ్బు సర్కార్ దగ్గర లేదు: ఈటల
X
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ సర్కార్ దగ్గర అంత డబ్బు లేదని స్పష్టం చేశారు. నాలుగేళ్లు కాదు కదా.. నలభై ఏళ్లు అయినా దళితులందరికీ ఇచ్చేంత డబ్బు కేసీఆర్ ప్రభుత్వం దగ్గర లేదని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్ కు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఈటల ప్రశ్నించారు. హుజూరాబాద్ లో ఇప్పటికే 192 కోట్లు ఖర్చు చేశారని.. ఇంకో నాలుగు, ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తారని చెబుతున్నారని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రజలు గమనించాలన్నారు.

దళితబంధు పథకం రావడానికి ఈటల రాజేందరే కారణం అంటూ తాజాగా దళిత సంఘాలు ఈటలకు ఆత్మీయ సన్మాన సభ నిర్వహించాయి. తాను ఆర్థిక మంత్రిగా పనిచేశానని.. తనకు బడ్జెట్ గురించి పూర్తిగా తెలుసునని చెప్పారు.

ప్రభుత్వం దగ్గర నిజంగా డబ్బు ఉంటే మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు బిల్లులు, కాంట్రాక్టు వర్కర్లు, ఇతర వర్కర్లకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పోరాటం చేసిన వారినే ప్రజలు గుర్తించుకుంటారని.. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఆ పార్టీకి పేరు దక్కలేదని.. టీఆర్ఎస్ కే తెలంగాణ తెచ్చిన పేరు వచ్చిందన్నారు. దళితబంధు విషయంలోనూ పోరాటం చేస్తున్న మనకే పేరు వస్తుంది తప్ప కేసీఆర్ కు మాత్రం రాదని ఈటల స్పష్టం చేశారు.