Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ను జిల్లా చేయాలట!

By:  Tupaki Desk   |   11 July 2021 1:30 AM GMT
హుజూరాబాద్ ను జిల్లా చేయాలట!
X
ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ వరాలు కురిపించి అభివృద్ధి చేయడం సీఎంకేసీఆర్ కు అలవాటని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. కేసీఆర్ సైతం ఎన్నికలు వస్తేనే బయటకు వస్తారని.. అభివృద్ధికి నిధులు ఇస్తారని ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ ను జిల్లా చేయాలన్న డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు స్వయంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ యే ఈ ప్రతిపాదన లేవనెత్తడం విశేషం.

తాజాగా ఈటల రాజేందర్ కీలక ప్రతిపాదన చేశారు. హుజూరాబాద్ ను జిల్లా చేయాలని.. వావిలాల, చల్లూరు లను మండలం వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ కనీసం నా రాజీనామా తీసుకోవడానికి కూడా ముందుకు రాకపోగా.. రాజీనామా ఇచ్చిన అరగంటలోనే ఆమోదించి గెజిట్ విడుదల చేసిన చరిత్ర దేశంలోనే ఇదే కావొచ్చు అని.. అంత తొందరగా నన్ను ఓడించాలని ఉబలాటపడుతున్నారని ఈటల అన్నారు.ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ఖాళీ చేయాలని ఫోన్ చేసి మరీ ఒత్తిడి చేశారని ఆరోపించారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో అందరు అధికారులను మార్చేశారని.. ప్రత్యేక అధికారులను నియమించుకున్నారని.. సొంత పార్టీ నాయకులను అంగట్లో సరుకులుగా కొంటున్నారని ఈటలరాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు కుల సంఘాల నాయకులను రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్ తీసుకెళ్లి అక్కడ బేరం కుదుర్చుకుంటున్నారని.. దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం కొనసాగుతోందని ఆరోపించారు. ఈ నియోజకవర్గం కాని వారికి ఇక్కడ ఓటు కల్పిస్తున్నారని ఆరోపించారు. నాకు పడే ఓట్లను తొలగిస్తున్నారన్నారు.

హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఇంట్లో 34 ఓట్లు పెట్టారని.. ఇంకో నేత ఇంట్లో 41 ఓట్లు నమోదు చేశారని ఈటల ఆరోపించారు.దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. మా కార్యకర్తలతో అడ్డుకుంటామన్నారు.

మొత్తంగా హుజూరాబాద్ పై కేసీఆర్ నజర్ బాగానే పెట్టారని ఈటల ఆరోపణలను బట్టి తెలుస్తోంది. ఇక జిల్లా చేయాలన్న డిమాండ్ ఊపందుకున్నా కేసీఆర్ మాత్రం ఇప్పట్లో చేసే అవకాశాలు లేవు.