Begin typing your search above and press return to search.

అమిత్ షాతో ఈట‌ల భేటీ.. ఏం జ‌ర‌గ‌బోతోంది?

By:  Tupaki Desk   |   15 July 2021 3:38 AM GMT
అమిత్ షాతో ఈట‌ల భేటీ.. ఏం జ‌ర‌గ‌బోతోంది?
X
హైద‌రాబాద్ మునిసిపాలిటీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన వేళ అమిత్ షా ఒక మాట‌న్నారు. ‘‘మేము ఢిల్లీ ఎన్నిక‌లైనా.. గ‌ల్లీ ఎన్నిక‌లైనా.. ఒకే విధంగా చూస్తాం. విజ‌య‌మే అంతిమ ల‌క్ష్యం’’ అని చెప్పారు. ఇక‌, అత్యంత కీల‌క‌మైన హుజూరాబాద్ ఎన్నిక‌ను ఇంకెలా చూస్తార‌న్న‌ది అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే.. ఇంకా నోటిఫికేష‌న్ విడుద‌ల కానేలేదు. గెలుపు గురించి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు బీజేపీ నేత‌లు. ఈ మేర‌కు తెలంగాణ నేత‌ల‌తో హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. దీంతో.. ఏం జ‌ర‌గ‌బోతోందనే చ‌ర్చ మొద‌లైంది.

ఉత్త‌రాదిన తిరుగులేని ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన బీజేపీ.. ద‌క్షిణాదిన మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోతోంది. ఒక్క క‌ర్నాట‌క‌లో మిన‌హా.. మిగిలిన రాష్ట్రాల్లో నామ‌మాత్రంగానే ఉంది. దీంతో.. ఈ ప‌రిస్థితిని ఎలాగైనా మార్చాల‌ని ద‌శాబ్దాలుగా దండ‌యాత్ర‌లు చేస్తోంది. అయితే.. ద‌క్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి అనువుగా క‌నిపిస్తున్న రాష్ట్రం తెలంగాణే. ఇక్క‌డ గ‌డిచిన ద‌శాబ్ద కాలంలో కాంగ్రెస్ బ‌ల‌హీన ప‌డ‌డంతో.. అనివార్యంగా ఏర్ప‌డిన ఖాళీని భ‌ర్తీ చేసే అవ‌కాశం బీజేపీకి ఆయాచితంగానే ద‌క్కింద‌ని చెప్పాలి. దుబ్బాక ఉప ఎన్నిక వ‌ర‌కు నామ మాత్ర‌పు పార్టీగానే ఉన్న బీజేపీ.. ఆ త‌ర్వాత ఒక్క‌సారిగా పుంజుకుంది. అనంత‌రం జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని రీతిలో రాణించ‌డంతో.. మ‌రింత పైకి దూసుకెళ్లింది.

ఈ ప‌రిస్థితిని క్యాష్ చేసుకొని, తెలంగాణ రాష్ట్ర‌స‌మితిని ఎదిరించి రాష్ట్ర‌మంత‌టా విస్త‌రించాల‌నే త‌లంపుతో ఉంది. దానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది. స్థానికంగా ఉన్న ఈట‌ల బ‌లాన్ని ఉప‌యోగించుకొని ఈ ఎన్నిక‌లో ఎలాగైనా గెల‌వాల‌ని భావిస్తోంది. హుజూరాబాద్ లో గెల‌వ‌డం ద్వారా.. ఇక‌, టీఆర్ఎస్ ప‌ని అయిపోయింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం త‌మ‌దే అని చెప్ప‌డానికి క‌మ‌ల‌ద‌ళం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగానే.. నోటిఫికేష‌న్ కూడా రాకుండానే సీరియ‌స్ గా ఎన్నిక‌పై చ‌ర్చిస్తున్నారు.

అమిత్ షా రాజ‌కీయం ఎలా ఉంటుంది? ఎలాంటి వ్యూహాల‌ను అమ‌లు చేస్తారు? అన్న‌ది గ‌త ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే అర్థ‌మై పోతుంది. తెలంగాణ‌లో నిల‌దొక్కుకునేందుకు ఈట‌ల రాజేంద‌ర్ కీల‌కంగా ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశం ఉండ‌డంతో.. ఆయ‌న్ను చ‌క్క‌గా వినియోగించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. నిజానికి ఈట‌ల‌కు స్థానికంగా ఉన్న బ‌లం ఏంట‌న్న‌ది ఆయ‌న‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసిన త‌ర్వాత‌నే అంద‌రికీ తెలిసి వ‌చ్చింది. హుజూరాబాద్ లో దాదాపు 90 శాతం మంది ప్ర‌జాప్ర‌తినిధులు ఈట‌ల వెంటే నిల‌బ‌డడం స్థానికంగా.. ఆయ‌నుకున్న బ‌లాన్ని తెలియ‌జేసింది.

ఈ ప‌రిస్థితిని గులాబీ అధిష్టానం కూడా ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు. అధికారంలో ఉన్న పార్టీని కాద‌ని, బ‌య‌ట‌కు వెళ్లిపోయిన‌ ఈట‌ల‌తో ఉంటామ‌ని ప్ర‌క‌టించ‌డం సాధార‌ణ‌మైన విష‌యం కాదు. అప్ప‌టికి ఈట‌ల ఏ పార్టీలో చేర‌లేదు కూడా. అయిన‌ప్ప‌టికీ.. ఈట‌ల‌కే మ‌ద్ద‌తు తెలిపారు అక్క‌డి ప్ర‌జాప్ర‌తినిధులు. వీళ్లంద‌రినీ మ‌ళ్లీ త‌మ‌వైపున‌కు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. ఎవ‌రైతే వ్య‌తిరేక స్వ‌రం వినిపిస్తున్నారో.. వారితో మంత్రి గంగుల స‌మావేశ‌మై.. గులాబీ పార్టీ వైపున‌కు తిప్పే ప్ర‌య‌త్నం చేశారు.

ఇలా.. నువ్వా నేనా? అన్న‌ట్టుగా ఉన్న రేసులోకి ఇప్పుడు కాంగ్రెస్ కూడా బ‌లంగా వ‌చ్చేసింది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడు అయిన త‌ర్వాత ఆ పార్టీలో జోష్ మ‌రింత‌గా పెరిగిపోయింది. దీంతో.. తాము సైతం విజ‌య‌మే ల‌క్ష్య‌మే బ‌రిలోకి దిగ‌బోతున్న‌ట్టు కాంగ్రెస్ ప్ర‌క‌టిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్, ఈట‌ల త‌దిత‌ర నాయ‌కులు ఢిల్లీలో అమిత్ షాను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సంజ‌య్ పాద‌యాత్ర గురించి కూడా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి తెలంగాణ‌లో స‌త్తా చాటేందుకు బీజేపీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రి, ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి.