Begin typing your search above and press return to search.

విస్తరణ ముందు కేసీఆర్ వద్దకు ఈటెల..వాటీజ్ ద మ్యాటర్?

By:  Tupaki Desk   |   8 Sep 2019 8:21 AM GMT
విస్తరణ ముందు కేసీఆర్ వద్దకు ఈటెల..వాటీజ్ ద మ్యాటర్?
X
టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో ఆ పార్టీ కీలక నేత - కేసీఆర్ కేబినెట్ లో కీలక మంత్రి ఈటల రాజేందర్ భేటీ నిజంగానే ఆసక్తి రేపుతోంది. సీఎంతో మంత్రి భేటీ కూడా ఆసక్తికరమేనా? అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కేబినెట్ విస్తరణకు కేసీఆర్ సన్నాహాలు పూర్తి చేసుకుంటున్న వేళ... పార్ఠీ అధిష్ఠానంపై తనదైన శైలి వ్యాఖ్యలు చేసి తనను తాను కార్నర్ చేసుకున్న ఈటల... సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారంటే ఆసక్తే కదా. అది కూడా మరికొన్ని గంటల్లో కేబినెట్ విస్తరణ ఉందనగా జరిగిన ఈ బేటీ నిజంగానే ఆసక్తి రేపుతోంది.

కేసీఆర్ ను తాను కలిసింది దేనికోసమన్న విషయాన్ని ఈటల చెప్పరు...అలాగని ఇందుకోసమే ఈటల తన వద్దకు వచ్చారని కేసీఆర్ చెప్పరు. వారిద్దరి అనుచరులు కూడా అసలు విషయాన్ని చెప్పనే చెప్పరు. మరి మీడియా గుచ్చి గచ్చి అడిగితే.... ఏదో తాను నిర్వహిస్తున్న వైద్య - ఆరోగ్య శాఖకు సంబంధించి కీలక విషయాలను చర్చించేందుకే కేసీఆర్ తో ఈటల భేటీ అయ్యారన్న మాట వినిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో విజృంభిస్తున్న వ్యాధులపై చర్చించేందుకు సీఎం రమ్మంటేనే ఈటల వెళ్లారన్న మాటలు కూడా వినిపిస్తాయి.

సరిగ్గా ఇప్పుడు కూడా కేసీఆర్ తో ఈటల భేటీకి కారణాలు కూడా ఇలాగే వినిపిస్తున్నాయి గానీ... అసలు విషయం వేరేలా ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల అధిష్ఠానంపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల తన మెడపై తానే కత్తి వేలాడదీసుకున్నారు. అంతకాకుండా ఈ మంత్రివర్గ విస్తరణలో కేవలం చేరికలే కాకుండా తీసివేతలు కూడా ఉంటాయట. ఆరుగురు కొత్తొళ్లకు పదవులు ఇస్తున్న కేసీఆర్... ఓ నలుగురిని సాగనంపుతారన్న ప్రచారం సాగుతోంది. ఈ అధిష్ఠానంపై ధిక్కార స్వరాన్ని వినిపించిన ఈటల తన పదవిని కాపాడుకునేందకే కేసీఆర్ వద్దకెళ్లారన్న ప్రచారం సాగుతోంది. మరి తన వద్దకు వచ్చిన ఈటలకు కేసీఆర్ ఏ మేర అభయం ఇచ్చారో చూడాలి. మొత్తంగా కేసీఆర్ తో భేటీ తర్వాతైనా ఈటల మంత్రి పదవి పదిలమేనా? అన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.