Begin typing your search above and press return to search.

ఈట‌ల పార్టీ ఖాయమా.. బ‌ల‌మైన‌ సాక్ష్యం!

By:  Tupaki Desk   |   11 May 2021 3:30 PM GMT
ఈట‌ల పార్టీ ఖాయమా.. బ‌ల‌మైన‌ సాక్ష్యం!
X
రాష్ట్ర మంత్రివ‌ర్గం నుంచి ఈట‌ల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం.. ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టి ఎదురుదాడి చేయ‌డం అన్నీ జ‌రిగిపోయాయి. అయితే.. ఈట‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏంటీ? ఆయ‌న ఎటువైపు అడుగులు వేయ‌బోతున్నారు? అనే చ‌ర్చ మాత్రం ఇంకా కొన‌సాగుతోంది. ప్ర‌ధానంగా ఆయ‌న సొంత పార్టీ పెడ‌తార‌నే ఊహాగానాలే మొద‌ట్నుంచీ కొన‌సాగుతున్నాయి. అయితే.. తాజా ప‌రిణామంతో అది కార్య‌రూపం దాల్చడం ఖాయం అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇప్ప‌టికే.. ప‌లువురు నేత‌లు ఈట‌ల‌ను క‌లిసి వ‌చ్చారు. మంత్రిప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసినందుకు సానుభూతి తెలిపారు. మ‌రికొంద‌రు ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ గురించి కూడా చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. వీరిలో.. ఉద్య‌మం త‌ర్వాత నిరాద‌ర‌ణ‌కు గురైన నేత‌లే ఎక్కువ‌గా ఉన్నార‌ట‌. మాజీ టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఈట‌ల‌తో భేటీ కావ‌డం కూడా తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశమైంది.

అదేవిధంగా.. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు ఈట‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపిన‌ట్టు స‌మాచారం. క‌రీంన‌గ‌ర్ మాజీ జ‌డ్పీచైర్మ‌న్ ఉమ‌తోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి కూడా ఈటల‌కు సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు. వీరిలో మెజారిటీ నేత‌లు.. సొంత పార్టీ పెట్టాల‌నే ఈట‌ల‌ను కోరిన‌ట్టు స‌మాచారం.

ఇక‌, ఇటీవ‌లే ఈట‌ల వ‌ర్గం ఓ పాట‌ను రిలీజ్ చేసింది. అది నేరుగా టీఆర్ఎస్ మీద దాడిచేసిన‌ట్టుగానే అర్థ‌మ‌వుతోంది. ''యుద్ధం ఇక మొద‌ల‌య్యింది ఉద్య‌మ నేత‌ల‌రా.. సిద్ధ‌మ‌య్యి ఒక ఆత్మ‌గౌర‌వ పోరు స‌ల్పుదామా. ఈట‌ల రాజ‌న్న‌తో ఇక జెండ‌లెత్తుదామా.. ద‌గాకోరుల దౌర్జ‌న్యాన్ని గ‌ద్దె దించుదామా'' అంటూ సాగే పాట.. యుద్ధం ఎవ‌రిపైనో తేల్చేసింది.

ఈ పాట‌తో ఈట‌ల పార్టీ పెట్ట‌డం ఖాయ‌మే అనే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. మ‌రి, అది ఎప్పుడు మొద‌ల‌వుతుంది? విధివిధానాలేంటీ అన్నది తెలియడానికి మరికాస్త సమయం పట్టేట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కొవిడ్ ఇబ్బంది ఉన్న నేప‌థ్యంలో.. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.