Begin typing your search above and press return to search.

సిటీలో ఉండి.. సీఎం రివ్యూకు ఈటల డుమ్మా?

By:  Tupaki Desk   |   4 Sep 2019 5:19 AM GMT
సిటీలో ఉండి.. సీఎం రివ్యూకు ఈటల డుమ్మా?
X
గ్యాప్ అన్నది రాకూడదు. ఒకసారి వస్తే.. అది అంత త్వరగా తగ్గదు. అందునా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు మరింత భిన్నంగా ఉంటుంది. ఒక్కసారి ఆయన మనసులో నెగిటివ్ ఇంప్రెషన్ పడితే.. అది అంతకంతకూ పెరుగుతుందే తప్పించి తగ్గే ఛాన్స్ లేదంటారు. కారణం ఏమైనా కానీ.. కేసీఆర్ కు ఈటలకు మధ్య గ్యాప్ వచ్చిందన్నది ఇప్పుడు అందరూ నిజమేనని నమ్ముతున్నారు.

దీనికి తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గులాబీ జెండాకు మేమే ఓనర్లమంటూ ఈటెల చేసిన సంచలన వ్యాఖ్య టీఆర్ఎస్ లో భారీచర్చకు తెర తీసింది. టీఆర్ఎస్ పెట్టింది మొదలు ఇప్పటివరకూ కేసీఆర్ కు నచ్చని నేతలు నోట మాట బయటకు రాకముందే.. వారి కెరీర్ ఖతమయ్యేలా పరిణామాలు చోటు చేసుకునేవి. పార్టీలో వారి స్థాయి అంతకంతకూ తగ్గిపోయేది. ప్రాధాన్యత లేకుండా చేయటం.. బయటకు వెళ్లేలా చేయటం ఇప్పటివరకూ చేసింది.

ఇందుకు భిన్నంగా తొలిసారి తన మనసులో గూడుకట్టుకున్న అసంతృప్తిని బాహాటంగా చెప్పేసి సంచలనంగా మారారు ఈటెల. అధినేతను ఉద్దేశించి పరోక్షంగా ఈటెల్లాంటి వ్యాఖ్యలతో ఈటల మాటలు గులాబీ పార్టీలో కలకలం రేపాయి. ఒకసారి పొరపొచ్చాలు వస్తే.. గులాబీ బాస్ తో రిలేషన్ ఖతమే అన్న దానికి తగ్గట్లే.. ఈటల విషయంలోనూ అలాంటిదే చోటు చేసుకోనుందా? అంటే అవుననే అంటున్నారు.

దీనికి తగ్గట్లే.. తాజాగా పంచాయితీరాజ్ శాఖపై మంగళవారం నిర్వహించిన రివ్యూ సమావేశానికి ముగ్గురు మంత్రులు హాజరయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. జగదీశ్ రెడ్డిలు ఇద్దరూ అవుటాప్ స్టేషన్ కారణంగా హాజరు కాలేదు. ఆసక్తికరంగా వైద్యశాఖా మంత్రి ఈటల రాజేందర్ మాత్రం హైదరాబాద్ నగరంలో ఉండి కూడా హాజరు కాకపోవటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి ఒకవైపు రివ్యూ చేస్తుంటే.. మరోవైపు ఈటల రాజేందర్ నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. కేసీఆర్ తో తనకొచ్చిన పొరపొచ్చాలు పెరగటమే తప్పించి తరిగేది లేదన్న విషయాన్ని తాజా డుమ్మాతో రాజేందర్ చెప్పకనే చెప్పేశారా?