Begin typing your search above and press return to search.

ఈటెల కీలక ప్రకటన.. పాజిటివ్ వచ్చినా ఇంట్లోనే చికిత్స

By:  Tupaki Desk   |   8 Jun 2020 4:18 AM GMT
ఈటెల కీలక ప్రకటన.. పాజిటివ్ వచ్చినా ఇంట్లోనే చికిత్స
X
మాయదారి రోగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకూ పాజిటివ్ వచ్చినంతనే.. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించేవారు. పరీక్షల్లో పాజిటివ్ కాస్తా నెగిటివ్ వచ్చే వరకూచికిత్స చేసేవారు. అనంతరం వారిని డిశ్చార్జి చేశారు. ఇటీవల కాలంలో కేసులు సంఖ్య పెరిగిపోవటం.. కొత్తగా వస్తున్న పాజిటివ్ కేసుల్లో పరీక్షల్లో మాత్రమే పాజిటివ్ వస్తోంది కానీ.. ఎలాంటి రోగ లక్షణాలు ఉండని వారి సంఖ్య పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రోగ లక్షణాలు కనిపించకుండానే పాజిటివ్ వస్తే.. వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స చేయాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని ఈటెల వెల్లడించారు.

పాజిటివ్ వచ్చి రోగ లక్షణాలు తక్కువగా ఉన్న వారికి మూడు రోజులుగా ఇళ్లలోనే ఉంచి చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వ తాజా నిర్ణయం నేపథ్యంలో కాలనీ వాసులు.. అపార్ట్ మెంట్ వాసులు సహకరించాలన్నారు. మాయదారి జబ్బుకు గురైన వారిని బహిష్కరించవద్దన్న ఈటెల.. ప్రజలు అనవసరమైన భయాల్ని.. అపోహల్ని వీడాలన్నారు.

పాజిటివ్ వచ్చిన వారికి జ్వరం ఉంటేనే ఆసుపత్రుల్లో చికిత్స చేస్తామని.. మిగిలిన వారిని వారి ఇళ్లల్లోనే ఉంచి చికిత్స చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. గాలి ద్వారా మాయదారి రోగం సోకదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. రోగ లక్షణాలు లేకున్నాపాజిటివ్ వచ్చిన వారందరిని ఆసుపత్రుల్లో చేరిస్తే.. వైద్య సిబ్బంది మీద భారం పడటంతో పాటు.. ఒత్తిడి మరింత పెరుగుతుందన్న ఆందళన వ్యక్తం చేయటం గమనార్హం లాక్ డౌన్ సడలింపులు అన్ని కూడా ప్రజలు జీవనోపాధి కోల్పోకుండా ఉండేందుకే తప్పించి.. మరోకారణం లేదన్నారు. సడలింపుల నేపథ్యంలో అవసరం లేకున్నా బయటకు రావటం సరికాదన్నారు. అవసరం లేకున్నా రోడ్ల మీదకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఈటెల కోరుతున్నారు. మరి.. ప్రజలు ఆయన మాటల్ని సీరియస్ గా తీసుకుంటారా?