Begin typing your search above and press return to search.

ఈటెల‌కూ అదే గ‌తి ప‌డుతుందా..!

By:  Tupaki Desk   |   2 Sep 2019 4:33 AM GMT
ఈటెల‌కూ అదే గ‌తి ప‌డుతుందా..!
X
టీఆర్ ఎస్‌ లో ముస‌లం మొద‌ల‌వుతోందా ? గ‌తంలో మాదిరిగా సీనియ‌ర్ నేత‌ల‌ను పార్టీ నుంచి త‌ప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా.. ఆలె న‌రేంద్ర‌ - విజ‌య‌శాంతితో పాటు చాలా మంది సీనియ‌ర్ల‌కు ఎదురురైన అనుభ‌వాలే ప్ర‌స్తుతం మంత్రి ఈటెల రాజేంద‌ర్‌ కు ఎదురుకానున్నాయా..?. ఇప్పుడివే ప్ర‌శ్న‌లు గులాబీ పార్టీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. టీఆర్ ఎస్ పార్టీ ఓన‌ర్లం మేమే అంటూ మంత్రి ఈటెల ఇటీవ‌ల చేసిన హాట్ కామెంట్స్ గులాబీ శిబిరంలో కాక రేపుతున్నాయి.

తొలి నుంచి ఉద్యమంలో ఉన్న వాళ్లం… మ‌ధ్యలో వ‌చ్చిన వాళ్లం కాదన్న ఆయ‌న వ్యాఖ్య‌లు పార్టీ వర్గాల్లో తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారాయి. ఈ క్ర‌మంలోనే మ‌రో మంత్రి ఎర్రబెల్లి - ఈటెలపై మాటల ఈటెలు సంధించ‌డంతో దుమారం రేగుతోంది. టీఆర్ ఎస్ పార్టీకి ఓన‌ర్ కేసీఆర్ ఒక్కరేనని - ఈటెల పదవికి ఢోకా లేదని ఎర్ర‌బెల్లి ఆభయం ఇచ్చారు. మ‌రో కీల‌క నేత ఎమ్మెల్సీ క‌ర్నె ప్రభాకర్ స్పందిస్తూ టీ ఆర్ ఎస్ లో ఉన్న వాళ్లంతా గులాబీ జెండా ఓన‌ర్లేనని ఈటెల పార్టీలోనే ఉన్నాడు క‌దా ? ఇక స‌మ‌స్య ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు.

అయితే ఈ ఇద్ద‌రు నేత‌లు త‌మ వ్య‌క్తిగ‌త అభిప్రాయం వ్య‌క్తం చేశారా..లేక హైక‌మాండే వీరితో అలా మాట్లాడించిందా అనేది అంతుచిక్క‌డంలేదు. ఈటెల‌ను టార్గెట్‌ గా చేసుకుని వీరు చేసిన వ్యాఖ్య‌ల‌పై సొంత పార్టీలోనే చాలా మందికి సందేహాలు ఉన్నాయి. నిజానికి రెండో సారి టీఆర్ ఎస్ అధికారంలో కొచ్చిన త‌ర్వాత మంత్రి వ‌ర్గంలో ఈటెల‌కు చోటు ద‌క్క‌ద‌నే చ‌ర్చ సాగింది. చివ‌రి నిమిషం వ‌ర‌కు ఈ స‌స్పెన్స్ కొన‌సాగ‌గా - ఎట్ట‌కేల‌కు ఈటెల‌కు మంత్రిగా అవ‌కాశం ఇచ్చారు. అయితే అధికారాలు ఏమి లేక‌పోవ‌డంతో ఆయ‌న అప్ప‌టి నుంచి అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది.

గ‌త ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టిన సీనియ‌ర్ నేత‌లు హ‌రీశ్‌ రావుతోపాటు నాయిని న‌ర‌సింహారెడ్డికి సైతం రెండో సారి మంత్రి వ‌ర్గంలో స్థానం కల్పించ‌లేదు. అదే స‌మ‌యంలో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నేత‌ల‌ను అంద‌లం ఎక్కిస్తున్నార‌ని నేత‌లు లోలోప‌ల ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఈక్ర‌మంలోనే ఈ టెలకు కూడా చెక్ పెడుతున్నార‌ని - ఆయ‌న్ను కూడా మంత్రి పదవి నుంచి తప్పించ‌డం ఖాయ‌మ‌ని పార్టీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో కూడా ఇలాగే పొమ్మ‌న లేక పొగ‌బెట్టిన‌ట్లు టీఆర్ ఎస్ నుంచి ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల‌ను బ‌య‌ట‌కు సాగ‌నంపార‌ని టీఆర్ ఎస్‌ లో చ‌ర్చ జ‌రుగుతోంది.