Begin typing your search above and press return to search.

దేశపతికి షాకు..ఈటెల వేదన తగ్గలేదా?

By:  Tupaki Desk   |   14 Sep 2019 2:30 PM GMT
దేశపతికి షాకు..ఈటెల వేదన తగ్గలేదా?
X
టీఆర్ ఎస్ ఎపుడు బద్దలవుతుందో తెలియని అగ్నిపర్వతంలా కనిపిస్తోంది. అయితే... పరిస్థితులు ఇంకా అదుపులోనే ఉన్నట్టు ఒకవైపు కనిపిస్తుండగా... మరోవైపు బుజ్జగింపుల అనంతరం కూడా కొందరి మాటల్లో తేడా కనిపిస్తోంది. టీఆఎస్ లో హరీష్ రావు ఎపిసోడు ముగిశాక ఈటెల ఎపిసోడ్ మొదలైంది.

వాస్తవానికి హరీష్ లాగా ఈటెల కేసీఆర్ కుటుంబ సభ్యుడు కూడా కాదు. అయినా... తన బాధను - అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇందులో అతని ధైర్యం ఏంటో అని అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మంత్రి పదవి ఊడుతుందని ప్రచారం జరిగిన అనంతరం విస్తరణ తర్వాత కూడా ఈటెల మంత్రిగానే కొనసాగుతున్నారు. స్వయానా కేసీఆర్ ఈటెలను పిలిచి మాట్లాడారు. ఇక అంతా సైలెంట్ అనుకుంటున్న సమయంలో... ఈటెల తాజా వ్యాఖ్యలు పరిస్థితి అదుపు తప్పిందా అన్న అనుమానాలకు తావిస్తున్నాయి.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి ఈటల ఈరోజు అసెంబ్లీకి వచ్చారు. లాబీల్లో ఈటల తిరుగుతున్నపుడు కేటీఆర్ వర్గపు వ్యక్తి అని ముద్రపడిన దేశ పతి శ్రీనివాస్ ఈటల రాజేందర్ ను అక్కడ గమనించి పలకరించారు. ఈటలతో పాటు ఎమ్మెల్యే కిషోర్ అక్కడే ఉన్నారు. వారిద్దరూ కలిసి ఎక్కడికో బయలుదేరగా... నేను కూడా మీతో రావచ్చా సార్ అని ఈటలను దేశపతి శ్రీనివాస్ అడిగారు. దానికి ఈటెల రాజేందర్ ఏమాత్రం తుడుముకోకుండా... ’’నా అవసరం మీకేముందయ్యా?‘‘ అంటూ ఎటువంటి హావభావమూ లేకుండా స్పందించారు. ఆ సమాధానాంతో అవాక్కయిన దేశపతి ... అక్కడి నుంచి సెలైంటుగా పక్కకెళ్లిపోయారు. ఈటెల కూడా ఏమీ జరగనట్టు తన మానాన తాను వెళ్లిపోయారు.

ఇదంతా గమనిస్తున్న అక్కడి వారికి మాత్రం విస్మయం కలిగింది. కొందరు జర్నలిస్టులు కూడా అక్కడ ఉన్నారు. నాయకులతో పాటు మీడియా వారు ఈటెల స్పందన చూసి... వ్యవహారం ఇంకా ఎంత దాకా వెళ్తుందో అన్నట్టు చర్చించుకున్నారు. పదవి తీయలేదు - కేసీఆర్ తిట్టలేదు... ఇంకా ఏంటి ఈటెల బాధ అని కొందరు అంటే... పవర్ లేని పదవితో ప్రయోజనం ఏంటన్నట్టు ఇంకొందరు స్పందించారు. ఏది ఏమైనా... టీఆర్ ఎస్ లో పరిస్థితులు అంత ప్రశాంతంగా ఏం లేవు.