Begin typing your search above and press return to search.

ఆఫీసులో స్నానం చేసి ఈటెలను ఇంటికి రమ్మంటున్నారట

By:  Tupaki Desk   |   7 March 2020 5:29 AM
ఆఫీసులో స్నానం చేసి ఈటెలను ఇంటికి రమ్మంటున్నారట
X
విన్నప్పుడు సరదాగా అనిపించినా.. తనకు ఎదురైన అనుభవాన్ని మంత్రి స్థానంలో ఉండి.. ఓపెన్ కావటం మాత్రం నిజంగా మంత్రి ఈటెల గొప్పతనంగా చెప్పాలి. కరోనా వైరస్ ప్రజల్ని ఎంతలా వణికిస్తుందో? సామాన్యుల మీదనే కాదు..ప్రముఖుల కుటుంబాల్లోనూ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తనకు వ్యక్తిగతంగా ఎదురైన అనుభవాన్ని మీడియాతో చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు.

సాధారణంగా ఇలాంటి ప్రైవేటు విషయాలు చెప్పేందుకు మంత్రుల స్థానంలో ఉన్న వారు ఇష్టపడరు. కానీ.. మంత్రి ఈటెల అందుకు భిన్నమని చెప్పాలి. కరోనా వైరస్ భయాందోళనల నేపథ్యంలో తన కుటుంబ సభ్యులు తనకు ఇస్తున్న సలహాలు.. సూచనల గురించి సరదాగా చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా వ్యవహరిస్తున్న ఈటెల నిత్యం పలు ప్రాంతాల్లో పర్యటించటం.. వివిధ వర్గాల వారిని కలుసుకోవటం మామూలే. ఇదే విషయాన్ని తన ఇంట్లోని వారు ప్రస్తావిస్తూ.. ‘"రోజూ ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఆసుపత్రులకు వెళ్లి వస్తున్నారు. డాక్టర్లు.. పేషంట్లతో సన్నిహితంగా ఉంటున్నారు. అందుకే ఇంటికి వచ్చే ముందు ఆఫీసులోనే స్నానం చేసి రండి’" అని చెబుతున్నట్లు వెల్లడించిన ఆశ్చర్యపోయేలా చేశారు. మీడియాతో జరిపిన ఇష్టాగోష్టిలో ఈ ఆసక్తికర విషయాన్ని చెప్పేసిన ఆయన నవ్వేయటమే కాదు.. మీడియా ప్రతినిధుల్ని ఒక్కసారి నవ్వేలా చేశారు. కానీ.. విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రం ప్రముఖుల ఇళ్లల్లోనూ కరోనా భయాందోళనలు ఎంతలా ఉన్నాయన్నది ఇట్టే అర్థం కాక మానదు.