Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు మరో సవాల్ విసిరిన ఈటల రాజేందర్

By:  Tupaki Desk   |   5 Aug 2021 11:30 AM GMT
కేసీఆర్ కు మరో సవాల్ విసిరిన ఈటల రాజేందర్
X
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అందరి చూపు హుజూరాబాద్ వైపై ఉంది. ఇక్కడి నియోజకవర్గం నుంచి మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కాగా..ఆ తరువాత ఎమ్మెల్యే పదవి, టీఆర్ఎస్ పార్టీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ తరువాత ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో గెలిచేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజీపీ పోటా పోటీగా ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నాయి. ఓ వైపు ఈటల రాజేందర్ పాదయాత్రతో ప్రజలందరినీ కలుస్తూ ఉండగా టీఆర్ఎస్ సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పాదయాత్రతో అస్వస్థతకు గురైన ఈటల తాజాగా డిశ్చార్జ్ అయ్యి కేసీఆర్ కు సంచలన సవాల్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజల కంటే వారి ఓట్ల మీదనే ప్రేమ ఎక్కువ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తాజాగా అనారోగ్యం పాలైన ఈటల కోలుకొని ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం గురువారం డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు మెరుగైన వైద్యం అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఉద్యమకారులంతా కనుమరుగవుతున్నారని.. తెలంగాణ ద్రోములంతా తెరపైకి వస్తున్నారని ఈటల ఆరోపించారు.

మానుకోటలో ఓదార్పు యాత్ర సమయంలో ఉద్యమకారులపై రాళ్లదాడి చేసిన వ్యక్తి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారని.. ఈ విషయంపై తనతో కలిసి పనిచేసిన ప్రతి ఉద్యమకారులు ఆలోచించాలని కోరారు. ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పట్టం కడుతున్నారని విమర్శించారు.

గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించారని ఈటల ఆరోపించారు. త్వరలో జరుగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకు సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలను నమ్ముకున్నారని ఆరోపించారు. ఒక్కో నాయకుడికి ఖరీదు కట్టి కొనుగోళ్ల పర్వానికి తెరలేపారని రాజేందర్ ఆరోపించారు.

ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో రూ.150 కోట్లను నగదు రూపంలో ఖర్చు చేశారని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతోనే కేసీఆర్ కు హామీలు గుర్తొచ్చాయని.. అందుకే తాయిలాలు ప్రకటిస్తున్నారని ఈటల మండిపడ్డారు. నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

గత ఏడేళ్లలో ఏనాడూ అంబేద్కర్ కు కేసీఆర్ పూలదండలు వేయలేదని ఈటల అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్.. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత తొలగించారని అన్నారు.

దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు దాన్ని వర్తింపజేయాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వాళ్లను కూడా ఆదుకోవాలని ఈ మాజీ మంత్రి డిమాండ్ చేశారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి హామీ ఇచ్చి ఇంకా నెరవేర్చలేదన్నారు.

డ్రామాలు ఆడుతున్నానంటూ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఈటల అన్నారు. వైద్యుల సూచనమేరకు రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తామని ఈటల రాజేందర్ వెల్లడించారు.

దళితబంధు పథకం హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ప్రకటించారని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈటలకు సన్నిహితులైన పలువురు నేతలు కూడా ఇటీవల టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామంటూ ప్రకటించారు. పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఇదే చెబుతున్నారు.

హుజూరాబాద్ లో నేతలను పెద్ద ఎత్తున కేసీఆర్ కొంటున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించడంతో ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హుజూరాబాద్ కేంద్రంగా ఉప ఎన్నిక జరుగనుంది.