Begin typing your search above and press return to search.

వచ్చే ఎన్నికల్లో గజ్వేల్లో మంటలేనా ?

By:  Tupaki Desk   |   10 July 2022 4:37 AM GMT
వచ్చే ఎన్నికల్లో గజ్వేల్లో మంటలేనా ?
X
వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలోని కొన్ని నియోజకవర్గాల్లో గట్టిపోటీ తప్పేట్లులేదు. ఇందులో భాగంగానే గజ్వేల్లో మంటలు మండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంతకీ గజ్వేలులో మంటలు ఎందుకు మండుతున్నాయి ? ఎందుకంటే గజ్వేలు నుండి ఇపుడు కేసీయార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేసీయార్ పై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి బీజేపీ నేత ఈటల రాజేందర్ రెడీ అయిపోతున్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతు కేసీయార్ పై గజ్వేలులో తాను పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈమధ్యనే జరిగిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఈటెల గెలిచిన విషయం తెలిసిందే. హుజూరాబాద్ లో జరిగిన ఉపఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈటలను ఓడించేందుకు కేసీయార్ సర్వశక్తులు ఒడ్డారు. ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించారు. అధికారయంత్రాంగం మొత్తాన్ని ఉప ఎన్నికల్లో దింపారు. మంత్రులు, ఎంఎల్ఏలను గ్రామగ్రామంలో దింపారు. ఇంత చేసినా చివరకు 23 వేల ఓట్ల మెజారిటితో ఈటల గెలవటం అప్పట్లో ఒక సంచలనం.

అలాంటి ఈటల రాబోయే ఎన్నికల్లో కేసీయార్ పై పోటీకి రెడీ అవుతున్నారంటే ఎన్నికల్లో గజ్వేలులో మంటలు మండకుండా ఉంటుందా. కేసీయార్ పోటీలో ఉంటారు కాబట్టి యావత్ పార్టీతో పాటు అధికార యంత్రాంగం కూడా మద్దతుంటుందనటంలో సందేహం లేదు. ఇదే సమయంలో ఈటల కూడా గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతారు. దాంతో మొత్తం తెలంగాణాలోనే గజ్వేలులో పోటీ ఏ రేంజిలో ఉంటుందో ఎవరికి వారుగా అంచనాలు వేసుకోవాల్సిందే.

కేసీయార్ పై గజ్వేలులో పోటీకి ఈటల రెడీ అవుతున్నారు బాగానే ఉంది. అసలు కేసీయార్ అసెంబ్లీకి పోటీ చేస్తారా అన్నది అసలు పాయింట్. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని అనుకుంటున్న కేసీయార్ వచ్చే ఎన్నికల్లో మెదక్ నుండి పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. గజ్వేలులో కేసీయార్ కు బదులుగా ఒంటేరు ప్రతాపరెడ్డి పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.