Begin typing your search above and press return to search.

వేడెక్కిన హుజూరాబాద్: ఈటల వర్సెస్ హరీష్ రావు

By:  Tupaki Desk   |   6 Aug 2021 5:21 AM GMT
వేడెక్కిన హుజూరాబాద్: ఈటల వర్సెస్ హరీష్ రావు
X
తెలంగాణలో ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ కాబడి.. ఆ తరువాత ఎమ్మెల్యే, పార్టీ పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల మరోసారి తన పాగా వేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇందులో భాగంగా పాదయాత్ర చేస్తూ ఊరూరా తిరుగుతున్నాడు. ఇదే సమయంలో అధికార పార్టీ ఇక్కడి సీటును కోల్పోకుండా ప్రజలను ఆకర్షించే పథకాలు ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో ఈటలకు పోటీగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఇక్కడి నియోజకవర్గం బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా ఈటల, హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

పాదయాత్రతో అస్వస్థతకు గురైన ఈటల రాజేందర్ ఇటీవల ఆసుపత్రిలో చేరికి చికిత్స పొందాడు. ఆ తరువాత నిన్న డిశ్చార్జి అయిన ఈటల అధికార పార్టీపై మాటల బాణాలు ఎక్కుపెట్టాడు. టీఆర్ఎస్ అధికారంలో ఉండి ఓట్లను కొనుగోలు చేస్తోందని, ఓట్లను కొనుక్కుంటే నాయకుడు అనిపించుకోరని, బ్రోకర్ అంటారని విమర్శించారు. ప్రజల మన్ననలను పొందేవాడు ప్రజానాయకుడు అనిపించుకుంటారని, కానీ టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు డబ్బులు పంచి ఓట్లను కొనుక్కుంటున్నారని అన్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా డబ్బులు వెదజల్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇలా ధనంతో ఓట్లు కొనడం ద్వారా ప్రజా ప్రభుత్వం అనిపించుకోదని అన్నారు. ఇలా ఎన్ని వేల కోట్లు పంచుతావ్ కేసీఆర్..? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలకు డబ్బులు పంచడాన్ని ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తుందని అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్లకే టీఆర్ఎస్ పట్టం కడుతుందని, కేసీఆర్ దగ్గర ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో రాళ్లు విసిరారన్న విషయం గుర్తుకురాలేదా..? అని ప్రశ్నించారు. ఎంతో మంది మంత్రులు, నాయకులు వచ్చి హుజూరాబాదోలో పాగా వేస్తున్నారని, నన్ను ఓడించడానికి ఇంత పెద్ద వ్యూహం రచిస్తున్నారంటే ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేస్తుందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.

ఇక ఈటల వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్రజలు వ్యక్తి కంటే వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ మోడీ ఫొటోను ఎందుకు దాచిపెడుతున్నారన్నారు. ప్రధాని మోడీ ఫొటో చూడగానే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు గుర్తుకు వచ్చి ఓట్లు పడవని అనుకుంటున్నారా..? అని అన్నారు. ఈటల రాజేందర్ ప్రచార శైలిని మార్చారన్నారు. తకాషాయ రంగులో కేవలం తన ఫఫొటోనే మాత్రమే వేసుకుంటూ మిగతా నాయకుల ఫొటోలను పక్కనపెడుతున్నారన్నారు.

బీజేపీలో చేరిన ఈటల గెలిస్తే నియోజకవర్గానికి చేసేదేమీ లేదన్నారు. తన ప్రతాపంతో కేంద్రం నుంచి రూ.1000 కోట్లు తెచ్చే సత్తా ఉందా..? అని అన్నారు. ఈటల మాటలకు ప్రజలు మోసపోవద్దన్నారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ 1000 చేశారని, భవిష్యత్లో రూ.1500 చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటో అఅందరికీ అర్థమైందని అన్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఈటల రాజేందర్ గెలిస్తే ఏమీ కొత్తగా జరగదన్నారు.

ఇన్ని రోజులు కామ్ గా ఉన్న హరీశ్ రావ్ ఇక రంగంలోకి దిగడంతో నియోజకవర్గంలో ప్రచారం వాడీవేడిగా మొదలైందని అనుకుంటున్నారు. ఇక నోటిఫికేషన్ రాకముందే మాటల యుద్ధంతో ఇక్కడ రాజకీయం వేడెక్కుతోంది. నోటిఫికెషన్ వెలువడిన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.