Begin typing your search above and press return to search.

ఈటెల కూడా రెఢీగానే ఉన్నారా? వైరల్ గా మారిన 30 సెకన్ల ప్రొమో

By:  Tupaki Desk   |   1 May 2021 4:30 AM GMT
ఈటెల కూడా రెఢీగానే ఉన్నారా? వైరల్ గా మారిన 30 సెకన్ల ప్రొమో
X
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కీలక పోలింగ్ ముగిసిన కాసేపటికే టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు చెందిన టీ న్యూస్ చానల్ లో మంత్రి ఈటెల భూకబ్జాపై సంచలన కథనం ప్రసారం కావటం..తెలంగాణ రాజకీయాల్లోనే కాదు.. ఏపీ రాజకీయ వర్గాల్లోనూ సంచలనంగా మారింది. కేసీఆర్ కు సన్నిహితుడైన ఈటెలపై ఈస్థాయిలో విరుచుకుపడటం చూస్తే.. పరిణామాలన్ని పక్కా ప్లానింగ్ తోనే జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. ఈటెల టీం కూడా ఈ పరిణామాల్ని ముందస్తుగానే ఊహించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే.. ఈటెలపై భూకబ్జా ఆరోపణలతో చానల్ లో స్టోరీ ప్లే అయిన కాసేపటికే.. ఈటెలను కీర్తిస్తూ విడుదలైన 30 సెకన్ల వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మీడియాలో తనపై విషం చిమ్మే వారిని టార్గెట్ చేసేలా ఈ చిట్టి వీడియో ఉందని చెప్పాలి. రాబోయే రోజుల్లో విడుదల చేసే వీడియో కు సంబంధించిన ప్రోమోగా దీన్ని పలువురు అభివర్ణిస్తున్నారు.

30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో.. తాజా పరిస్థితి.. జరుగుతున్న కుట్ర.. ఈటెలను బోనులోకి ఎక్కించిన తీరును ఎండగడుతూ.. ఈటెల కీర్తిని ఆకాశానికి ఎత్తేలా ఉండటం గమనార్హం. ఎమోషనల్ మ్యూజిక్ తో.. ఈటెలను వివిధ రూపాల్లో ఫోకస్ చేసేలా క్లిప్పింగులు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో పాట ఆకట్టుకునేలా ఉండటం గమనార్హం.

‘‘అక్షరాల సాక్షిగా అసత్యాల రాతలు.. మచ్చలేని మనిషిపై మీడియా కుట్రలు.. దిక్కులా నిలిచినోడిని దిగజార్చే మాటలా? దిక్కులన్ని ఒక్కటైనా బెదిరిపోడు ఈటెల..’’ అంటూ సాగిన 30 సెకన్ల నిడివి ఉన్న ఈ చిట్టి వీడియోను చూస్తే.. రాబోయే ఉపద్రవాన్ని ముందే ఊహించి తయారు చేశారా? లేదంటే.. అప్పటికప్పుడు తయారు చేశారా? అన్నది ప్రశ్నగా మారింది. స్వల్ప వ్యవధిలో ఈ తరహా వీడియో సాధ్యం కాదని.. కాస్త ముందుస్తుగానే సిద్ధం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా సారు మాత్రమే కాదు.. ఈటెల సైతం తనను కమ్మేసే ఆరోపణల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించక మానదు.