Begin typing your search above and press return to search.

కేసీఆర్ నోట రాని మాట ఈటెల నోటి వెంట వచ్చిందే

By:  Tupaki Desk   |   2 Aug 2020 7:37 AM GMT
కేసీఆర్ నోట రాని మాట ఈటెల నోటి వెంట వచ్చిందే
X
ఎదుటోడు ఎవరైనా సరే.. తమ రాజకీయ ప్రయోజనాలకు దెబ్బేస్తున్నాడన్నంతనే అలెర్ట్ అయిపోయే కేసీఆర్.. వారికి ఎలా బుద్ది చెప్పాలన్న దానిపై మాస్టర్ ప్లాన్ వేస్తుంటారు. వర్తమాన రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా మారిన ఆయన.. ఒకప్పుడు మాత్రం ఇందుకు భిన్నంగా ఎన్నో రాజకీయ ఎదురుదెబ్బలు తిన్నాడు. ఇదే ఆయన్ను రాటుదేల్చటంతో పాటు.. ఎప్పుడేం చేస్తే మంచిదన్న విషయంపై అవగాహన పెంచేలా చేసిందేమోనని అనిపించక మానదు.

చాలా సందర్భాల్లో నేరుగా నిర్ణయాలు తీసుకునే కేసీఆర్.. కొన్ని సందర్భాల్లో మాత్రం తాను కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా అలాంటి సీన్ ఒకటి కనిపించటం ఆసక్తికరంగా మారింది. కరోనా నేపథ్యంలో.. ఆ మహమ్మారికి చికిత్స చేసేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వటానికి కేసీఆర్ ససేమిరా అనటం తెలిసిందే. చికిత్స బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పేవారు. తర్వాతి కాలంలో అనుమతులు ఇవ్వటం.. ప్రైవేటు..కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

ఇలాంటప్పుడు ప్రభుత్వ పెద్దగా కన్నెర్ర చేయొచ్చు. ఏపీలో మాదిరి ప్రైవేటు ఆసుపత్రుల్ని ప్రభుత్వమే తాత్కాలికంగా తీసుకొని.. తమ ఆధ్వర్యంలో నడిచేలా నిర్ణయం తీసుకోవచ్చు. ఇలా చేస్తే.. ఆయన కేసీఆర్ ఎందుకు అవుతారు? నలుగురికి అర్థం కానట్లుగా వ్యవహరించటం ఆయనకు అలవాటైన పని. ఈ కారణంతోనే కావొచ్చు.. కరోనా ఎపిసోడ్ లో చాలా తక్కువ సందర్భాల్లోనే మాత్రమే తనకు తానుగా సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా కనిపిచే మంత్రి ఈటెల రాజేందర్ తాజాగా నిర్వహించిన రివ్యూలో తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు.

ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఇష్టారాజ్యంగా వసూళ్లు చేయటం.. డబ్బుల కోసం రోగుల కుటుంబ సభ్యుల్ని వేధింపులకు గురి చేయటం లాంటి అంశాలపై చర్యలకు ఆయన సిద్ధమయ్యారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న దోపిడీ విషయంలో చూస్తూ ఉండిపోమన్న వార్నింగ్ ఆయ నోటి నుంచి రావటం గమనార్హం. నిజానికి.. ఇలాంటి వాటి విషయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తెర మీదకు వస్తారు. ప్రజలకు మేలు కలిగించే విషయంలో ముఖ్యమంత్రిగా తనకున్న బాధ్యతను అందరికి తెలిసేలా చేయటంతో పాటు.. తాను ప్రజల పక్షమే తప్పించి కార్పొరేట్ ఆసుపత్రులకు కొమ్ముకాయనన్న సందేశాన్ని ప్రజలకు చేరేలా చేస్తారు. ఈసారి మాత్రం.. అందుకు భిన్నంగా తనకు బదులుగా మంత్రి ఈటెలను రంగంలోకి దించటం ఆసక్తికరంగా మారింది.

సామాన్యుల్ని దోచుకునే తీరును తప్పు పట్టే విషయంలో తాను మాత్రమే అందరికంటే ముందుంటానని చెప్పేలా చేసే కేసీఆర్.. ఈసారి అందుకు భిన్నంగా తెర వెనుకగా ఉండి.. తన మంత్రి చేత సందేశాన్ని ఇప్పించటంలో మర్మం ఏమిటన్నది ఇప్పుడు చర్చగా మారింది. కేసీఆర్ కు కొన్ని విషయాల మీద మాట్లాడటం ఇష్టం ఉండదని.. అందుకు ప్రత్యేకంగా కారణం ఉండదని.. అలాంటి కోవలోకే కార్పొరేట్ ఆసుపత్రుల సబ్జెక్టు కూడా ఒకటన్న మాట వినిపిస్తోంది. అదేమీ కాదు.. ఇదంతా పక్కా ప్లాన్ తో జరుగుతోందన్న మాట కూడా వినిపిస్తోంది. ఏకాఏకిన సీఎం సీన్లోకి వచ్చేసి వార్నింగ్ ఇచ్చాక కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోతే.. కార్పొరేట్ ఆసుపత్రుల మీద ఆయనకు పట్టు లేదన్న భావన ప్రజల్లో కలుుగుతందని.. అది తన ఇమేజ్ కు భంగం వాటిల్లేలా చేస్తుందన్న ముందుచూపుతో.. ఈటెలను ప్రయోగించినట్లు చెబుతున్నారు. చూసేందుకు ఈటెల వారు సాహసం చేసినట్లుగా కనిపిస్తుంది కానీ.. దాని వెనుక ఉన్నది కేసీఆర్ అన్న విషయం అర్థం కాని విధంగా గులాబీ బిగ్ బాస్ ప్లానింగ్ చేశారన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేయటం గమనార్హం.